దృశ్యాలు అద్భుతం.. భావోద్వేగాలు శూన్యం.. రాముడుని బిజినెస్ కి వాడుకోవాలన్న దృక్పథంతో తీసిన పక్కా కమర్షియల్ సినిమా ఈ “రామాయణం”. రామాయణం మహాకావ్యం.. ఇప్పుడు వీళ్ళు తీసిన రామాయణం కేవలం దృశ్య కావ్యం మాత్రమే. మహాకావ్యం కాకపోవడానికి కారణం దృశ్యాల మీద చూపించిన శ్రద్ధ, మాటల మీద, భావోద్వేగాల మీద చూపించలేకపోవడమే. అలా చేసి ఉంటే ఈ చిత్రం కూడా ప్రపంచ సినీ చరిత్రలో అమర కావ్యంగా మిగిలి ఉండేది. భారీ నటులు ఉన్నా, భావోద్వేగాలు సాదాసీదాగా ఉండడం ఈ సినిమాలో ప్రధాన లోపం. రామాయణంకావ్యంలోని ప్రతి పాత్రలోను మానవ నైజాలు అడుగడుగునా ప్రతిబింబిస్తాయి. ఈ సినిమా రామాయణంలో మాత్రం ఒక యాక్షన్ సినిమాలా రాముడు, రావణుని మధ్య మాత్రమే నడపడం నిరాశ కలిగించే విషయం. రామాయణ కావ్యంలో ఉన్న పాత్రల ప్రాధాన్యత తగ్గింపు ఈ సినిమా విజయాన్ని తగ్గించేసింది. అందరికీ తెలిసిన రామాయణాన్ని, అనేక భాషల్లో ఎన్నోసార్లు తీశారు, అయినా జనం చూశారు, హారతులు పట్టారు. బాపు, రమణలు తెరకెక్కించిన పతి చిత్రంలో రామాయణ కావ్యంలోని పాత్రలు, పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. బాల రామాయణం, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, లవకుశ ఈ చిత్రాలు ఏ గ్రాఫిక్స్ లేని కాలంలో తీసినవి. వీటిలో ఉన్న సంగీతం, మాటలు ఇప్పటికీ హృదయాల్లో ఉన్న భక్తి భావాన్ని తట్టి లేపుతాయి. ఈ రామాయణం మాత్రం భారీతనంతోనే నిండి, భక్తి భావం కొరవడింది. భావోద్వేగాల పరంగా రామానంద్ సాగర్ తీసిన టీవీ రామాయణానికి దిష్టి తీయడానికి కూడా ఈ రామాయణం పనికిరాదు…
అందుకే తూటా రేటింగ్ 1/5…

Leave a Reply