Latest News

తెలుగు సినిమాల్లో కామెడీ పరిస్థితేంటి?

తెలుగు సినిమాల్లో కామెడీ స్వరూపం గత కొన్నేళ్లుగా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కథతో సంబంధం లేకుండా కేవలం నవ్వించడానికే నడిచే సెపరేట్ కామెడీ ట్రాక్‌లు ఉండేవి, కానీ ప్రస్తుతం కామెడీ స్క్రీన్‌ప్లేతోనూ, కథానాయకుడి ప్రవర్తనతోనూ ముడిపడి ఆర్గానిక్‌గా సాగుతోంది. ఒకప్పుడు బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్. నారాయణ, సునీల్ వంటి కమేడియన్ల  కోసం రచయితలు ప్రత్యేకమైన సబ్‌ప్లాట్, సీన్లు రాసేవారు. ప్రస్తుతం పాన్-ఇండియా యాక్షన్ కథలు, సీరియస్ థ్రిల్లర్ల డిమాండ్  పెరగడంతో కామెడీకి  సైడ్ ట్రాక్‌లకి చోటు లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో  రొటీన్ స్లాప్‌స్టిక్ పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీ, డార్క్ హ్యూమర్, సెల్ఫ్ జోకులు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. సన్నివేశంలో ఉండే సహజమైన అయోమయం లేదా టెన్షన్ నుంచి నవ్వులు పుట్టించే ధోరణి పెరిగింది.

హీరోలే ప్రధాన హాస్య వనరుగా మారడం: కమెడియన్‌ల మీద ఆధారపడకుండా హీరో పాత్రలోనే కామెడీ టైమింగ్ ఉండడం  ఆధునిక ట్రెండ్. నాని, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, శ్రీవిష్ణు వంటి నటులు తమ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తోనే ప్రధాన వినోదాన్ని అందిస్తున్నారు.

కొత్త తరం కమెడియన్లయిన సత్య, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, సుదర్శన్ వంటి నటులు కథలో భాగంగా ఉంటూనే బలమైన ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా సత్య చేసే డెడ్-పాన్ హ్యూమర్, అమాయకత్వపు బాడీ లాంగ్వేజ్‌కి  ప్రత్యేకమైన ఆదరణ దక్కుతోంది.

ఇంకా రీల్స్, మీమ్స్ , సోషల్ మీడియా ప్రభావం వల్ల సోషల్ మీడియా మీమ్ కల్చర్, పాప్ కల్చర్ రిఫరెన్సులు థియేటర్‌లో త్వరగా కనెక్ట్ అవుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ ట్రెండ్ ఓవర్‌డోస్ అవడం వల్ల కామెడీకి ‘షెల్ఫ్ లైఫ్’ తగ్గిపోతోంది, కొద్ది నెలలు గడిచాక ఆ జోకులు కాలం చెల్లినట్టు అనిపిస్తున్నాయి.

సంపూర్ణ కామెడీలు  (జాతిరత్నాలు, మ్యాడ్ తరహావి) అప్పుడప్పుడు భారీ విజయాలు సాధిస్తున్నప్పటికీ, కథా బలం లేని బలవంతపు కామెడీని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించడం లేదు. సహజత్వం, పాత్రల ఔచిత్యం ఉన్న హాస్యమే ప్రస్తుతం బాక్సాఫీసులో  నిలబడుతోంది.

పొతే, క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ సీన్లు రాయడం అంటే కేవలం పంచ్ డైలాగులు పేర్చడం కాదు. పాత్ర బలహీనతలు, అహం, అమాయకత్వం లేదా స్థిరమైన ప్రవర్తన నుంచే సహజమైన హాస్యం పుట్టేలా సన్నివేశాల్ని సృష్టించాల్సి వుంటుంది. అంటే పాత్రకి తనపై తనకి  ఉండే మితిమీరిన నమ్మకం (ఓవర్ కాన్ఫిడెన్స్) లేదా లోపాన్ని గుర్తించలేని తత్వం ఈ టైపు కామెడీకి ఇంధనం.

ఉదాహరణకి డీజే టిల్లు లో సిద్ధూ జొన్నలగడ్డ అమాయకపు ఆవేశం, తనకి బోలెడు తెలివితేటలు ఉన్నాయనే భ్రమ; లేదా జాతిరత్నాలు లో నవీన్ పోలిశెట్టి తనని  తాను మేధావిగా భావించడం వంటివి. పాత్ర సీరియస్‌గా ఉన్నకొద్దీ, ఆ అజ్ఞానం చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారు. 

ఇంకో టైపు కామెడీ వుంది. ఉదాహరణకి ఒకరు నిరంతరం ఆందోళన చెందే పిరికివాడు అయితే, మరొకరు ఏమాత్రం బాధ్యత లేని నిర్లక్ష్య వ్యక్తీ కావడం (రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి తరహా డైనమిక్స్). ఒకరి ప్రవర్తన మరొకరి సహనాన్ని పరీక్షించినప్పుడు ఆ సంఘర్షణ నుంచి కామెడీ వస్తుంది.

ఇంకా కామెడీ పాత్ర సమాజంలో లేదా ఎదుటి వ్యక్తి ముందు ఏదో పెద్ద హోదాలో ఉన్నట్టు నటించడం, ఆ అబద్ధాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ వికటించడం వుంది. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో ఈ టెక్నిక్ విస్తారంగా కనిపించేది. నేటి సినిమాల్లో ఇది మరింత సూక్ష్మమైన బాడీ లాంగ్వేజీతో వ్యక్తమవుతోంది.

సినిమా కామెడీ సీజనల్. ఒక సీజన్ లో ఒక ట్రెండ్ లో ఒకటైపుతో మొదలైన కామెడీ అదేపనిగా విసుగెత్తే వరకూ రిపీటై అంతరించిపోతుంది. మళ్ళీ ఇంకో టైపు మొదలవుతుంది. కన్ఫ్యూజ్ కామెడీలు, హర్రర్ కామెడీలూ ఇలా వచ్చివెళ్లినవే. ఒకప్పటి వరకూ  కమెడియన్లకే పరిమితమైన  కామెడీ విభాగం – ఏకంగా స్టార్లు కామెడీ చేయడంతో అదో ఫ్యాషన్ గా  కామెడీ విభాగం స్టార్ల హస్తగతమైపోయింది.  కమెడియన్లు అడుక్కి జారిపోయారు. అంతేకాదు, స్టార్లే కామెడీ చేయడంతో అల్లరి నరేష్, సునీల్ లలాంటి కామెడీ హీరోలకీ గడ్డు కాలం వచ్చింది. గతంలో కామెడీ హీరోలు గా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్  ల వంటి వాళ్ళు ఎదురులేకుండా  వెలిగిపోయారంటే  అందుక్కారణం  అప్పట్లో హీరోలు కామెడీ చేసే వాళ్ళు కాదు. కమెడియన్ల పని కమెడియన్లు,  వాంప్ ల పని వాంప్ లు చేసుకునే వాళ్ళు. కమెడియన్ల పని స్టార్లూ, వాంప్ ల పని హీరోయిన్లూ చేయడంతో రెండిటి కళాకారులూ గల్లంతయ్యారు. అయితే కామెడీ ఎప్పుడైతే స్టార్ల చేతికి వెళ్ళిపోయిందో, అప్పుడది  కృత్రిమంగా, ఒక టెంప్లెట్ గా, మొక్కుబడి వ్యవహారంగా  మారిపోయింది. 

-సికిందర్ 

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *