- – రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ ; ప్రధానమంత్రి తన మొబైల్ ఫోన్ ట్యాప్ చేసి రహస్యంగా వింటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఇన్ స్టా గ్రామ్’ నిర్వహించే ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో ఒక మద్దతు దారు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రధానమంత్రి మోడీ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఈ విషయంలో ముఖాముఖి చర్చకు రావాలని మరోసారి రాహుల్ డిమాండ్ చేశారు. గత 12 రోజుల్లో ప్రధాని తనతో చర్చకు రావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం ఇది ఏడవసారి. అయితే ప్రధాని నుండి ఇంతవరకు సమాధానం రాలేదు. కాగా, రాహుల్ డిమాండ్ ను బిజెపి నేతలు కొట్టిపారేస్తున్నారు. అసలు అన్ని విషయాలు చర్చించడానికి పార్లమెంట్ ఉండగా మరోచోట చర్చలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, తనతోపాటు దేశంలో అనేకమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థల వద్ద పెగాసస్ అనే ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ఉందని, దాంతో దేశంలో పలువురు నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది నూటికి నూరుశాతం నిజం కాబట్టే తనతో ముఖాముఖి చర్చకు ప్రధాని మోడీ ముఖం చాటేస్తున్నారని రాహుల్ తెలిపారు.

Leave a Reply