10 PERSONS ARRESTED
హైదరాబాద్ లో 6 కోట్లు నకిలీ కరెన్సీ పట్టివేత
దేశమంతటా చలామణి… పలువురి అరెస్ట్
‘ ఫ ర్జీ ’ వెబ్ సిరీస్ చూసి ప్రేరణ…‘అలీబాబా’ నుండి పేపర్ కొనుగోలు
ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ పట్టుబడుతోంది. రాజస్థాన్, యుపి, హర్యానా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణలలో పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని పట్టుకుని పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు లక్ష ఒరిజినల్ నగదు తీసుకుని మూడు నుండి నాలుగు లక్షల దాకా నకిలీనోట్లను అందజేస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలింసిటీ వద్ద ఈనెల 1న ఒక కారునుండి పోలీసులు 6.78 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా, హయత్ నగర్ లోని కుంట్లూరులో ఒక అద్దె ఇంట్లో 500 రూపాయల నోట్లను ముద్రిస్తున్నట్టు గుర్తించారు. మడుపోజు కరుణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్, షాద్ నగర్ ప్రత్యేక పోలీసు బృందాలు ఈ ఆపరేషన్ ను నిర్వహించినట్టు పోలీస్ కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు.
ఇదిలా ఉండగా,ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నిందితులు షహీద్ కపూర్ హిందీ వెబ్ సిరీస్ ఫర్జీ చూసి ప్రేరణ పొందినట్టు పోలీసులు తెలిపారు. వీటిని తయారు చేసిన ప్రధాన నిందితుడు రవికుమార్ మిశ్రా పోలీసుల నుండి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. అయితే మూడురోజుల్లో మూడు రాష్ట్రాల్లో 1300 కిలీమీటర్లు చేజ్ చేసి చివరకు పంజాబ్ లోని లూధియానాలో అతడిని పట్టుకున్నారు. సెప్టెంబర్ 30న రాజస్థాన్ లోని దుంగార్ పూర్ లో భవేశ్ కుమార్, నయన్ జోషి అనే ఇద్దరిని అరెస్ట్ చేసి 5కోట్ల వరకు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు యుపికి చెందిన రవి కుమార్ మిశ్రా పేరు బయటికి వచ్చింది. అతడికి ఐడియా ఇచ్చిన హర్యానా కు చెందిన అనంద్ రాజ్ పుత్ ను, వారికి సహకరించిన ఆరిఫ్ మహమ్మద్ అలియాస్ అంకిత్, తరుణ్ మాలేకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆన్ లైన్ లో అలీబాబ్.కామ్ నుండి పేపర్ ను తెప్పించుకున్నట్టు తెలిసింది. యూట్యూబ్ లో నకిలీ కరెన్సీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నట్టు నిందితులు తెలిపారు. ఇక ఢిల్లీలో నకిలీ రాకెట్ గుట్టు ఒక షాప్ యజమాని వల్ల బయటపడింది. గత జూన్ 30న ఒక వ్యక్తి ఐదు సిగరెట్ ప్యాకెట్లు కొని వందరూపాయల నోట్లు ఆరు ఇవ్వగా అవి నకిలీవని గుర్తించిన యజమాని పోలీసులకు తెలిపాడు. వెంటనే నిందితుడిని పట్టుకొని విచారించగా ముంబయిలో నటరాజ్ మోహన్ కంచన్, వినోద్ మున్నీలాల్, ఢిల్లీలోని సుభాష్ చంద్రలు వీటిని తయారు చేస్తున్నట్టు తేలింది. వారి నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నకిలీ కరెన్సీ చలామణి అవుతోంది.

Leave a Reply