IMPEACHMENT NOTICE
Former CIVIL SERVENTS DEMANDS
సిఇసి జ్ఞానేశ్ పై చార్జిషీట్ !
- మాజీ సివిల్ సర్వెంట్ల ధర్మాగ్రహం.
- రాజీనామా చేసి పరువు నిలుపుకోండి
- పబ్లిక్ ఇంపీచ్ మెంట్ నోటీసు జారీ
న్యూఢిల్లీ ; చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పలువురు మాజీ సివిల్ సర్వెంట్లు డిమాండ్ చేశారు. ఇంకా పరువుపోకముందే రాజీనామా చేసి పదవినుండి తప్పుకోవాలని సోమవారం నాడిక్కడ జరిగిన సమావేశంలో వారు కోరారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్రహోంశాఖ మాజీ కార్యదర్శి జికె.ఫిళ్లై , సామాజిక ఉద్యమకారుడు యోగేంద్రయాదవ్,మాజీ రాయబారి అశోక్ శర్మ, మాజీ కార్యదర్శులు అమితాబ్ పాండే,అశీష్ జోషి, ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ యశోవర్ధన్ ఆజాద్, సతర్క్ నాగరిక్ సంఘటన్ వ్యవస్థాపకురాలు అంజలీ భరధ్వాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఒక చార్జిషీట్ ను, అభిశంసన నోటీసును తయారు చేశారు. ఒక ప్రతినిధి బృందంగా వెళ్లి సిఇసిని కలసి మర్యాదగా వాటిని అందజేయాలని నిర్ణయించారు. అయితే, ఎలక్షన్ కమీషన్ ప్రధాన కార్యాలయం(నిర్వాచన్ సదన్)కు వెళ్లే దారులన్నీ బారికేడ్లు పెట్టడంతో వాటిని పబ్లిక్ గా విడుదల చేశారు.
ఈ చార్జిషీట్ లో ఆరు అభియోగాలు మోపారు. చట్టబద్దమైన ఇసి ఉమ్మడి బాధ్యతను విస్మరించడం, తప్పుల తడకగా ఫారం-6ను తీసుకురావడం, అధికార కేంద్రీకరణ, ఓటర్ల జాబితాను ఇష్టమొచ్చినట్లు సవరించడం, పెద్దఎత్తున ఓటర్లను తొలగించడం వంటివి ఈ అభియోగాల్లో ఉన్నాయి. ఓటర్ల ప్రాథమిక హక్కులకు పూర్తిగా భంగం కలిగించడం క్షమించరాని నేరమన్నారు. సిఇసిని రీకాల్ చేయడం అనేది చాలా చిన్నమాట అని, అసలు ఆయన నియామకమే చట్టవిరుధ్దమని వారు వివరించారు. సిఇసిగా ఉండడానికి ఎటువంటి నైతిక, రాజ్యాంగబద్ధత జ్ఞానేశ్ కు లేదని తమ లేఖలో ఈ ప్రముఖులు తెలిపారు. పదవిని దుర్వినియోగపరిస్తే తప్ప ఎలక్షన్ కమిషనర్లను తొలగించకుండా రాజ్యాంగంలోని 324(5) అధికరణం రక్షణ కల్పిస్తున్నదని, అయితే జ్ఞానేశ్ పై ఈ ఆరు అభియోగాలు ఆయన ఉద్వాసనకు సరిపోతాయని వారన్నారు.