Articles & Opinion

BJP trying to EMERG in PUNJAB 

పంజాబ్ లో పాగావేసేందుకు బిజెపి యత్నాలు  

 చండీగఢ్ ; వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా కీలకమైనది కావడంతో ఈసారి అక్కడ పాగావేయడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని ఓడించి అధికారం కైవసం చేసుకున్న బిజెపి ఇప్పుడు పంజాబ్ లో కూడా ఆప్ ను ఓడించాలని ఎత్తుగడలు వేస్తోంది. అందుకే ఆప్ నాయకులను పెద్ద సంఖ్యలో తమ పార్టీలో  చేర్చుకుంటోంది. గత ఏప్రిల్ లో రాఘవ్ చద్దాతోపాటు ఐదుగురు రాజ్యసభ ఎంపీలను, సీనియర్ అడ్వొకేట్, ఎమ్మెల్యే హెచ్ఎస్ ఫూల్కాను తమ పార్టీలోకి చేర్చుకున్న బిజెపి తాజాగా మంగళవారం ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. వీరంతా చాలాకాలంగా ఆప్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఒకవైపు ఆప్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గాలం వేస్తూనే అకాలీదళ్ తో మళ్లీ పొత్తుకు కూడా యత్నిస్తోంది. గతంలో అకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్నపుడు బిజెపి 23 సీట్లలో పోటీచేయగా, మిగిలిన 94 స్థానాల్లో శిరోమణి అకాలీదళ్ పోటీచేసింది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టి ఎవరికివారే పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. అందుకని 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కలసి పోటీచేసేందుకు బిజెపి అకాలీదళ్ కు సంకేతాలు పంపుతోంది. అయితే ఈసారి 35 నుండి 40 సీట్లలో పోటీ  చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒకవేళ అకాలీదళ్ కలసి రాకున్నా ఆప్ రెబల్స్ ను , ఇతర పార్టీ నాయకులను చేర్చుకుని ప్రధాన పక్షంగా ఎదగడానికి అన్నియత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆప్ ఎమ్మెల్యేలను  చేర్చుకోవడం. కాగా, గత జనవరిలో మాజీ ఎంపీ జగ్మీత్ సింగ్ బ్రార్ కూడా బిజెపిలో చేరారు.గత మార్చిలో ఎస్ జిపిసి నాయకుడు చరణ్ జీత్ సింగ్ కాలేవాల్ , ఆగస్టులో అకాలీదళ్ ఎమ్మెల్యే దర్శన్ సింగ్ బిజెపిలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఆప్ విడుదల చేయగానే తమ పార్టీలో ఇందరు చేరారని, రెండవజాబితా రిలీజ్  చేయగానే మరికొందరు కూడా చేరుతారని బిజెపి నేతలు ఆశిస్తున్నారు.  మొత్తానికి ఎవరైనా ఫర్వాలేదు తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని బిజెపి ప్రకటించినట్టుగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అయితే ఆ పార్టీలో నేతలకు, అభ్యర్థులకు కొదువలేదు. ఈసారి రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికార పక్షం  ఆప్ ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉండగా, సొంతగానో, లేక మళ్లీ అకాలీదళ్ తో పొత్తు కుదుర్చుకునో బిజెపి ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. 

ఢిల్లీ నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చక్రం గట్టిగా తిప్పుతూ ఈసారి పంజాబ్ లో పాగా వేయాలని చూస్తున్నారు.  

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *