Andhra Pradesh

CEC Gyanesh Kumar Vs CEC TN Seshan : శేషన్ కు జ్ఞానేశ్ కు ఎంత తేడా !?

  • పదవి నుంచి తొలగించాలంటున్న ప్రతిపక్షాలు
  • ‘ పద్మభూషణ్ ’ ఇవ్వాలంటున్న  బిజెపి 

న్యూఢిల్లీ ; భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ ) ఎన్నడూ లేనంతగా ఇవాళ విమర్శలను ఎదుర్కొంటోంది. పనితీరుపై అనుమానాలు బలపడి ప్రతిష్ఠ మసకబారింది.  భారత 26వ  సిఇసి జ్ఞానేశ్ కుమార్ ఉద్వాసనకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దేశంలో చాలామంది ఓటర్లు కూడా ఇసి పనితీరుపై సంతృప్తికరంగా లేరు. దొంగఓట్లు, చనిపోయినవారి ఓట్లు తొలగించడం వల్ల కొందరు హర్షం వ్యక్తం  చేసినప్పటికీ దశాబ్దాలుగా ఓటర్లుగా ఉన్నవారిని కూడా అనేకరకాలుగా ఇక్కట్ల పాలు చేస్తుండడంతో సంఘం స్వయం ప్రతిపత్తిని కోల్పోయి, ఎవరి చేతిలోనో కీలుబొమ్మలా తయారైందనే విమర్శలకు బలం చేకూరింది.

                     ఒకప్పుడు ఇసి అంటే హడల్ !

గతంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన టి.ఎన్. శేషన్ ను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. భారత 10 వ సిఇసిగా 1990 నుండి 1996 వరకు పనిచేసిన శేషన్ దేశంలో హడలెత్తించారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే  ఏమిటో ప్రజలకు, రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున అవగాహన కలిగించారు. రాజకీయ నాయకులకు వణుకు పుట్టించారు. ఎన్నికల కమిషన్ ఖ్యాతిని పెంచి దాని స్వతంత్ర ప్రతిపత్తిని వెలిగేలా చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ను,  దొంగఓట్లను నిరోధించడానికి ఆయన విశేషంగా యత్నించారు. బాహాటంగా మద్యం, మనీ పంపిణీకి చెక్ పెట్టారు. ఓటర్లకు గుర్తింపుకార్డులు ఆయన హయాంలోనే వచ్చాయి. ప్రచారానికి సమయాలు నిర్ణయించడంతో పాటు గోడల మీద అడ్డమైన రాతలకు కాలం చెల్లింది. లౌడ్ స్పీకర్ల వాడకానికి వేళలు విధించి, టైమ్ దాటితే కొరడా ఝళిపించడం ఆయనే మొదలు పెట్టారు. రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలు క్రమంగా జరుపుకోవాలని, నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యే ఎంత ఖర్చు చేయాలి, ఎంపీ ఎంత ఖర్చు పెట్టాలి అనేది నిర్ణయించడంతో పాటు చేసిన ప్రతిరూపాయికి లెక్క చెప్పాలనే నిబంధనలతో రాజకీయ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. దీంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయాల తీరుతెన్నులు, ఎన్నికల నిర్వహణా శైలి, ప్రచార సరళి పూర్తిగా మారిపోయాయి.

                       కొందరు సెన్సేషన్…ఇంకొందరు ఆల్సేషన్..!

ఈ సముచిత సంస్కరణలు గిట్టనివారు ఆయనను ‘ఆల్సేషన్’ అని విమర్శించినా , అభినందించేవారెందరో ఆయనను ‘సెన్సేషన్’ అని ప్రస్తుతించారు. దేశంలో ప్రభుత్వాలు ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా, ‘ఈ విషయంలో మన శేషన్ గారేమంటున్నారు’  అంటూ ప్రజలు ఆరా తీసేవారు. మరి ఇప్పుడు పూర్తిగా భిన్నం. ఎన్నికల కమిషన్ ఏ చర్యతో ఎవరి ఓటు గల్లంతవుందోననే బెంగ దేశ ప్రజలను పీడిస్తోంది. కమిషన్ నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఇసిపై నిరసన వెల్లువెత్తుతోంది.

                   అందరినీ తొలగించాల్సిందే ; డింపుల్ యాదవ్

దాదాపు అన్ని రాష్ట్రాల్లో సిఇసి కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద కు ర్యాలీ నిర్వహించారు. జ్ఞానేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా అయితే జ్ఞానేశ్ పై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో 44 పేజీల ఆధారాలతో కంప్లెయింట్ చేశారు. సమాజ్ వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి ఒక్క జ్ఞానేశ్ నే ఎందుకు శిక్షించాలని ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న అందరినీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా ఇద్దరు ఇసి లతో పాటు కమిషన్ లోని ఇతర సిబ్బందికి, అధికారులకు ఈ వ్యవహారంలో భాగం ఉన్నందున అందరినీ తొలగించాల్సిందేనని ఆమె కోరుతున్నారు. అప్పుడే కమిషన్ విశ్వసనీయత పెరుగుతుందన్నారు. కమిషన్ లో పనిచేస్తున్న అన్నివిభాగాల అధికారులు కూడా అవకతవకలకు బాధ్యులేనని ఆమె వివరించారు. నిన్న పుట్టిన సిజెపి కూడా జ్ఞానేశ్ ఉద్వాసనకు ఆల్టిమేటం ఇచ్చేసింది.

                        ఎన్ డి ఎ పక్షాల మద్దతు

ఇదిలాఉండగా, ప్రతిపక్షాలవన్నీ గాలిమాటలు,నీటిమూటలని బిజెపి మిత్రపక్షాలు విమర్శిస్తున్నాయి. గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఇసి కుట్ర అనడం కాంగ్రెస్ కు అలవాటేనని అవి ఆరోపిస్తున్నాయి. ఇసి ఇచ్చిన వివరణతో తమ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయని అవి అంటున్నాయి. ఇక బెంగాల్ నుంచి జ్ఞానేశ్ కుమార్ కు అనూహ్యమైన మద్దతు లభించింది. ఆయనకు ‘ పద్మభూషణ్ ’ ఇవ్వాలని పశ్చిమబంగ బిజెపి అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య  సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల జాబితాను సక్రమంగా సవరించినందుకు, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించినందుకు ఆయన కనీసం ‘ పద్మభూషణ్’ అవార్డుకు అర్హుడేనని భట్టాచార్య అన్నారు. జ్ఞానేశ్ వ్యవహార దక్షత వల్ల పశ్చిమబంగ ప్రజలు చాలా సంతోషంగా, నిర్భయంగా ఓట్లువేయగలిగారని భట్టాచార్య కొనియాడారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో సవరణలతో సిఇసి జ్ఞానేశ్ కుమార్ వివాదాస్పదంగా మారారు. విదేశీయుల ఓట్లు, ముఖ్యంగా బర్మా, బంగ్లాదేశ్ ల నుండి పెద్దఎత్తున భారత్ లో చొరబడి, ఓటర్లుగా నమోదయినవారి ఓట్లు తొలగించడంలో ఎవరికీ ఏ అభ్యంతరం ఉండనక్కర లేదు. అలాంటి వారు దేశంలో ఎక్కడున్నా  ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నా తొలగింపును ఎవరూ తప్పు పట్టరు. ఆ నెపంతో ప్రతిపక్షాలకు ఓటువేస్తారనేవారి ఓట్లను తొలగించడమే విమర్శలకు, వ్యతిరేకతకు కారణం. దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒకప్పుడు బాగానే ఉండేది. మధ్యలో ఇసి ప్రభ వెలవెలబోయింది. మళ్ళీ శేషన్ వచ్చాక జవసత్వాలు పుంజుకుని జూలు విదిల్చి సింహంలా నిలబడింది. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ హయాంలో అపఖ్యాతి పాలైంది. అధికార పార్టీకి పూర్తిగా వినమ్రంగా ఉండేదిగా తయారైంది. ప్రజల సౌలభ్యం కోసం కాకుండా, అధికారపార్టీ మహామహుల ప్రచారాలకు వీలయ్యేలా ఎన్నికలు పలు దశల్లో నిర్వహించడం కూడా విమర్శలకు కారణమైంది. ప్రజల అభ్యంతరాలకు దిక్కులేదు. సందేహాల నివృత్తికి తావేలేదు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో పురోగమించినా, బ్యాలెట్ల స్థానంలో ఈవిఎంలు వచ్చినా, గంటల వ్యవధిలోనే భద్రతాదళాలు తరలివెళ్ళేలా రవాణా సౌకర్యాలు మెరుగుపడినా, ఎన్నికలు జరిపేందుకు నెలల తరబడి సమయం తీసుకోవడం, ఫలితాల కోసం బాగా ఎదురుచూడాల్సిరావడం, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాలు కాసే పరిస్థితి రావడం వంటివి ఎవరికీ అంతుపట్టడం లేదు. అలాగే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు పొంతన లేకపోవడం, పోలింగ్ ముగిసిన ఎన్నో రోజులకు పోలింగ్ శాతమెంతో చెప్పడం. ఇంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీ యుగంలో ఇంత అధ్వాన్న నిర్వహణ పలువురికి అనేకానేక అనుమానాలు రేకెత్తిస్తోంది. కాబట్టే జ్ఞానేశ్ ఎంత సమర్థుడైన అధికారి అయినప్పటికీ, విమర్శల వెల్లువలో, ఆగ్రహావేశాల వరదలో కొట్టుకుపోక తప్పదనే నిజాన్ని కేంద్రప్రభుత్వ పెద్దలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో చేసిన తాత్సారం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం సిఇసి జ్ఞానేశ్ విషయంలో చూపరని జనం ఆశిస్తున్నారు.

                                                   * — సతీశ్ కె.కె ( సీనియర్ జర్నలిస్ట్ )

    

Rate this article

How useful or interesting did you find this story?

4.5/5 2 ratings

One response to “CEC Gyanesh Kumar Vs CEC TN Seshan : శేషన్ కు జ్ఞానేశ్ కు ఎంత తేడా !?”