Articles & Opinion

“A single wedding and a 90,000-crore ruckus”   ఒక్క పెళ్ళి 90 వేల కోట్ల లొల్లి !

  • బెట్టింగ్ యాప్ తో విదేశాల్లో ఆస్తులు
  • దేశవిదేశాల్లో ‘మహాదేవ్’ విస్తృత నెట్ వర్క్
  • చత్తీస్ ఘడ్ మాజీ సిఎం భాగేల్ కు 500 కోట్ల లంచం

 దుబాయి;   కోవిడ్ మహమ్మారి అనేకమంది జీవితాల్లో చీకట్లు నింపితే, కొందరి జీవితాల్లో మాత్రం అపరిమితమైన ఆనందాన్ని తెచ్చింది. అడ్డగోలుగా డబ్బు ఇచ్చింది. కరోనా బారిన పడినవారి నుంచి లక్షల్లో బిల్లులు గుంజి ఆస్పత్రుల యాజమాన్యాలు బాగుపడితే, ఇంకొందరు మాత్రం టెక్నాలజీని జోడించి ప్రజల ఖాళీ సమాయాన్ని వాడుకుని కోట్లకు పడగలెత్తారు.  అందులో ప్రధానమైంది ‘‘ మహాదేవ్ ఆన్ లైన్ బుక్ ’’ అనే బెట్టింగ్ యాప్. దుబాయి కేంద్రంగా పనిచేసిన ఈ యాప్ సమారు 94 వేల కోట్లదాకా కొల్లగొట్టింది. కరోనా వ్యాధి వ్యాపించి దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలామంది ఖాళీగా ఇంటిపట్టున ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్నే బెట్టింగ్ కంపెనీ చాలా తెలివిగా వాడుకుంది. వంద రూపాయలతో ఎంటరై బెట్టింగ్ ఆడేట్టు చేసి కోట్లు వసూలు చేసింది. దేశవిదేశాల్లో విల్లాలు, రిసార్టులు సమకూర్చుకుంది. డొల్లకంపెనీలు ప్రారంభించింది. షేర్ మార్కెట్ లో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా రాజకీయనాయకులకు, పోలీసులకు, ఇతర అధికారులకు, కిందిస్థాయి సిబ్బందికి కోట్ల రూపాయలను ముడుపులుగా చెల్లించింది.

చత్తీస్ ఘడ్ మాజీ సిఎం భూపేశ్ భగల్ ఒక్కడికే 500 కోట్ల దాకా ముడుపులు ముట్టచెప్పింది. ఆయన సలహాదారు వినోద్ వర్మకు 65కోట్లు, ఇతరులకు కూడా పెద్దమొత్తంలోనే చెల్లించింది. కళ్లు బైర్లు కమ్మే ఈ వ్యవహారం చూసి దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ లు తెల్లమొహం వేశాయి. అధికారులు ఇప్పటివరకు 190 చోట్ల సోదాలు జరిపారు. 116 మంది నిందితులని గుర్తించారు. 14 మందిని అరెస్ట్ చేశారు. రెండువేల కోట్లదాకా నగదు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన ఆస్తి మొత్తం  విలువ  94 వేల కోట్లుగా అంచనాకు వచ్చారు.

  ఈ యాప్ ను చత్తీస్ ఘడ్ లోని భిలాయ్ కు చెందిన సౌరభ్ చంద్రాకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు ప్రారంభించారు. క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ , ప్లేయింగ్ కార్డ్స వంటి ఆటల్లో పందాలు కట్టడం, గెలిచినవారికి డబ్బు ఇవ్వడం ఈ యాప్ పని.2019-2020 లో ఇది బాగా విస్తరించింది. క్రమక్రమంగా దేశమంతటా విస్తరించుకుంటూ పోయారు. వికాస్ చపారియా, హరిశంకర్ టిబ్రేవాలా,అసీమ్ దాస్, చంద్రభూషణ్ వర్మ,సతీశ్ చంద్రాకర్, శుభం సోని, రోహిత్, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు.  మధ్యప్రదేశ్, యుపి, బెంగాల్, బీహార్,మహారాష్ట్ర, ఉత్తరాఖండ్,ఢిల్లీ లలో బాగా పాతుకుపోయింది. కస్టమర్ వంద రూపాయలు కడితే ఒక ఐడి క్రియేట్ చేస్తారు. దాంతో ఆట మొదలెట్టడం,పందాలు కాయడం చేయవచ్చు. ఇలా కస్టమర్లను చేర్చుకోవడానికి, వారిని పందేలు కట్టేలా ప్రోత్సహించడానికి, గెలిచినవారికి డబ్బులు చెల్లించేందుకు వీరిద్దరు పెద్దసంఖ్యలో ఏజంట్ల(పానెల్స్)  ను నియమించుకున్నారు. వారికి జీతాలు, కమీషన్లు చెల్లించడం, భారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేయడం ఈ నెట్ వర్క్ లో భాగమైంది. ఇలాంటి కమీషన్ ఏజంట్లను పర్యవేక్షించడానికి సూపర్ వైజర్లు, మేనేజర్లు వారిపైన నిఘాకు మరి కొందరు  ఇలా బ్రహ్మాండమైన వ్యవస్థను వీరు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. గెలుపొందిన వారికి ప్రతి సోమవారం చెల్లింపులు ఉంటాయి. కస్టమర్లు కట్టిన, బెట్టింగ్ డబ్బు మొదట ఏజంట్ల ఖాతాల్లో, అక్కడి నుండి బ్రాంచ్ మేనేజర్ల ఖాతాల్లోకి అటునుంచి దుబాయి కంపెనీకి తరలేది. ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించడానికి దుబాయిలోని ఆఫీసులో వెయ్యిమంది టెక్నికల్ నిపుణులు పనిచేస్తున్నారు. షిఫ్టుల వారీగా 24 గంటలు వీరు పర్యవేక్షించేవారు. స్కై ఎక్స్చేంజ్, లోటస్ 365,ఎబిక్స్ ఇంక్,రెడ్డి అన్నా, ఫెయిర్ ప్లే, లేసర్ బుక్, అంబానీ బుక్ వంటి కంపెనీలు ఏర్పాటు చేశారు.  వాట్సాప్ గ్రూప్ లతో, వెబ్ సైట్లతో, సోషల్ మీడియా తో బెట్టింగ్ లు జరిపేవారు. వచ్చిన డబ్బును మూల్ ఖాతాల్లోకి మళ్ళించేవారు. ఈ ఖాతాలను తెలిసి కొన్ని , కస్టమర్లకు తెలియకుండా కొన్ని ఓపెన్ చేసేవారు. కొందరికి కమీషన్ రూపంలో ఖాతా కింత అని చెల్లించేవారు. డొల్ల కంపెనీల్లోకి కూడా మార్చేవారు. విదేశాల్లోకి పంపేవారు మళ్ళీ అక్కడినుండి భారత్ లోని కంపెనీల ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు. ఇలాంటి పానెల్స్ లేదా బ్రాంచ్ లు 32‌00 వరకున్నాయని ఇడి, సిబిఐ అధికారులు గుర్తించారు. 2023 సంవత్సరం నుండి 2026 వరకు జరిగిన సిబిఐ , ఇడి దాడుల్లో ఈ విషయాలను కనుగొన్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. లాప్ ట్యాపులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వందల కొలది బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు.

 కాగా, ఈ వ్యవహారమంతా అరబ్ ఎమిరేట్స్ లోని రస్ అల్ ఖైమా నగరంలో జరిగిన ఒక పెళ్ళి వేడుక తీగలాగితే ఈ బెట్టింగ్ సామ్యాజ్యపు డొంక కదిలింది. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు సౌరభ్ చంద్రాకర్ వివాహం అక్కడ జరిగింది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు నాగపూర్ నుండి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. 112 కోట్లు విమాన టికెట్లకు, ఈ వెంట్ మేనేజర్లకు ఖర్చు చేశారు. పలువురు సెలబ్రెటీలను రప్పించారు. వారికి చెల్లించిన డబ్బు చూసి కూపీ లాగితే ఈ వ్యవహారం బయటపడింది. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఒమన్ లో ఉన్న సౌరభ్ చంద్రాకర్ ను సిబిఐ, ఇడి అధికారులు రప్పిస్తున్నారు. ఒమన్ పోలీసులు అతడిని అరెస్ట్  చేశారు. అయితే ఇంత భారీ స్థాయిలో జరిగిన బెట్టింగ్ యవ్వారం పెద్దస్థాయి వ్యక్తుల అండదండలు లేనిదే సాధ్యం కాదని, అసలు ఈ కంపెనీ వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి పోయిందని దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నిందితులను, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా కోర్టులో అవి ప్రవేశపెట్టాల్సి ఉంది.

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *