Andhra Pradesh

20 Lakhs Fine On A Hospital For 10 Rupees Collection రూ.10 వసూలు చేసినందుకు ఆస్పత్రికి 20 లక్షల జరిమానా !

  

  •  అక్రమ పార్కింగ్ దందాకు చెక్
  • వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

సిమ్లా ; అక్రమ పార్కింగ్ దందాల గురించి మనందరికి తెలిసిందే. రైల్వేస్టేషన్లలో, బస్టాండుల్లో, సినిమాహాళ్లలో, ఇతర చోట్లలో ఉత్తపుణ్యానికే వాహనాల పార్కింగ్ ఫీజు పేర మనదగ్గర బాగానే వసూలు చేసే ఘనులంతా ఇప్పుడు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఆస్పత్రి ఇలాగే పార్కింగ్ ఫీజు పేరుతో పదిరూపాయలు అదనంగా వసూలు చేసినందుకు 22 లక్షల జరిమానా కట్టాల్సి వచ్చింది.

      ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూడడానికి వెళ్లిన ఒక న్యాయవాది నుండి అక్కడి పార్కింగ్ సిబ్బంది పదిరూపాయలు అదనంగా వసూలు చేశారు. దీంతో ఆయన జిల్లా వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు. ఆస్పత్రుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని, ద్విచక్రవాహనాలకు రోజుకు 200, కార్లకు రూ.400 వసూలు చేస్తూ సరైన రశీదులు ఇవ్వడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   దీంతో కేసు విచారించిన ఫోరం చైర్మన్ హిమాంశు మిశ్రా, సభ్యులు ఆర్తి సూద్, నారాయణ్ ఠాకూర్ లు ఆ ఆస్పత్రికి గత సెప్టెంబర్ లో రూ. 20 లక్షల జరిమానా విధించారు. పార్కింగ్ కాంట్రాక్టర్ రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఈ కేసు వేసిన న్యాయవాదికి 15 వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

   కాంగ్రాలోని ఆర్ పి జిఎంసి ఆస్పత్రి లో పార్కింగ్ కోసం గంటకు 20 రూపాయలుగా నిర్ణయించారు. ఈ న్యాయవాది రెండుగంటలలోపే తన ఆల్టో కారుని పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచారు. బయటికి వెళుతుండగా అక్కడి కాంట్రాక్టర్ మనుషులు 40 రూపాయలకు బదులు 50 ఇవ్వాలని పట్టుబట్టారు. ఎంత చెప్పినా వినకుండా కారును ఆపివేశారు. దీంతో రూ.50 చెల్లించి బయటపడ్డ ఆ న్యాయవాది అనంతరం వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ కు, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఫోరం నోటీసులు జారీ చేసి సమగ్రంగా విచారించింది. తమకు పార్కింగ్ తో, ఫీజులతో సంబంధం లేదని అదంతా కాంట్రాక్టర్ చూసుకుంటాడని ఆస్పత్రి యాజమాన్యం, హెల్త్ సెక్రటరీ చేతులెత్తేశారు. అలాగే ఎక్కువ చార్జీలు వసూలు చేయలేదని, నిబంధనల మేరకే వసూలు చేశామని, ఆ న్యాయవాది కారు ఆవరణలో మూడుగంటలకు పైగా ఉంచాడని, రూ.60 వసూలు చేయాల్సింది పోయి తన మనుషులు 50 మాత్రమే వసూలు చేశారని కాంట్రాక్టర్ బుకాయించాడు. కాని న్యాయవాది సమర్పించిన వివరాలు అన్నీ పరిశీలించాక ,అక్కడ చాలా అవకతవకలున్నాయని ఫోరం గమనించి  భారీ జరిమానా విధించింది. అంతేకాక అసలు పార్కింగ్ కోసం ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో, ఏ పధ్దతి  పాటిస్తున్నారో , వాహనదారులకు ఎటువంటి సదుపాయాలు అందిస్తున్నారో సవివరంగా తెలుపాలని, రేట్లు న్యాయబద్దంగా నిర్ణయించాలని, వాటిని ఒక అత్యున్నత అథారిటీ ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖను ఆదేశించింది. అలా వసూలు చేసిన పార్కింగ్ ఫీజును పార్కింగ్ ఏరియా బాగుకోసం, వాహనదారుల సౌకర్యాల కోసమే వాడాలని ఫోరం ఆదేశించింది. ఆ ఆస్పత్రికి విధించిన 20 లక్షల జరిమానా పేదరోగుల వైద్యం కోసం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో జమచేయాలని సూచించింది. కాంట్రాక్టర్ చెల్లించే రెండు లక్షలు జిల్లా ఎస్పీ వద్ద డిపాజిట్ చేయాలని, దానిని రహదారి భద్రత కోసం, హెల్మెట్ల పంపిణీ కోసం వినియోగించాలని కూడా ఆదేశించింది. ఇలా అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన పార్కింగ్ సదుపాయాల కల్పనకోసం కృషిచేయాలని సూచించింది.  

                   ……………………………

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating

One response to “20 Lakhs Fine On A Hospital For 10 Rupees Collection రూ.10 వసూలు చేసినందుకు ఆస్పత్రికి 20 లక్షల జరిమానా !”