Articles & Opinion

MAHARASHTRA ROCKED BY ₹500 CRORE CONTROVERSY!  మహా రాష్ట్రలో 500 కోట్ల దుమారం

  శ్రీకాంత్ షిండే ఇచ్చాడంటూ ఆడియో లీక్

 ముంబయి ; మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రూ.500 కోట్ల దుమారం చెలరేగింది. 2024 ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే 500 కోట్లను మహారాష్ట్ర కోటా రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమకారుడు మనోజ్ జారంగి పాటిల్ కు అందజేశాడని పుకార్లు గుప్పుమన్నాయి. ఈమేరకు ఓ మహిళ ఫోన్ లో ఎవరితో చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బయటికి వచ్చింది. దీన్ని స్వయంగా మనోజ్ జారంగి పాటిల్ ప్లే చేసి బహిరంగ సభలో వినిపించారు. తనకు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని, అలాంటి డబ్బేది తాను తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తాము డబ్బు ఎవరికీ ఇవ్వలేదు, తీసుకోలేదని శ్రీకాంత్ తండ్రి ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని ఆయన ప్రధాని నరేంద్రమోడీకి, హోంమంత్రి అమిత్ షా కు లేఖలు రాశారు. కాగా ఈ విషయాన్ని తేల్చాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. బిజెపి డబ్బుకు శ్రీకాంత్ షిండే కొరియర్ గా వ్యవహరించాడని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

కాగా, మరాఠా నాయకుడు ఏక్ నాథ్ షిండేకు వ్యతిరేకంగా కట్ర నడుస్తోందని శివసేన మాజీ మంత్రి రాందాస్ కదమ్ ఆరోపించారు. బిజెపితో కలసి షిండేను అణగదొక్కేందుకే ఇది జరుగుతోందని, బిజెపి ఎంఎల్ సిలు  ప్రవీణ్ దారేకర్, ప్రసాద్ లాడ్ లు దీనికి కారకులని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్రసాద్ లాడ్ తీవ్రంగా ఖండించారు. అసలు జారంగి పాటిల్ వెనుక ఎవరున్నారో త్వరలో తేలుతుందన్నారు. అయినా ఎన్నికలు జరిగి రెండున్నరేళ్ల తర్వాత ఈ ఆరోపణలు రావడమేమిటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు.

 అసలు రూ.500 కోట్లను తీసుకుపోవడానికి ఎన్ని వాహనాలు కావాలి.ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడికి పోయాయని శ్రీకాంత్ షిండే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిజెపి-శివసేన (షిండేవర్గం) ల మధ్య విభేదాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలని ఆయన ఆరోపించారు. శివసేన మంత్రి గులాబ్ రావ్ పాటిల్ దసరా ర్యాలీలో మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అని ప్రకటించడమే దీనికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు.   

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate