Articles & Opinion

Violence in Hollywood

వాక్లావ్ మార్హౌల్ అనే దర్శకుడు 2019 లో తీసిన ‘ది పెయింటెడ్ బర్డ్’ లో అత్యంత క్రూర, హింసాత్మక దృశ్యాలకి వెనిస్ లో డెలిగేట్స్, క్రిటిక్సూ నిరసన ప్రకటించి వాకౌట్ చేశారు. వెనిస్ లోనే కాదు, టొరంటో, లండన్‌లలో జరిగిన అంతర్జాతీయ చలచిత్రోత్సవాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. తల నుంచి కళ్ళు పెకిలించివేయడం, ఆహారం కోసం వెతికే కాకులు పసి పిల్లాడిని  పొడిచి దాదాపు చంపడం, ఒకావిణ్ణి కత్తితో పొడిచి, ఆమె జననాంగాల మీద తన్నడం, ప్రత్యర్థి ఆగ్రహానికి గురైన వ్యక్తి కనుగుడ్లు కోల్పోవడం వంటి అసహ్య, భయానక దృశ్యాలతో ఈ చలన చిత్రమనే కళా రూపం నిండిపోయి వుంది. దీనికి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఉదంతాలనే చూపినట్టు ఆ దర్శకుడి సమర్ధన.

2022 లో రాబర్ట్ ఎగ్గర్స్ అనే దర్శకుడు తీసిన ‘ది నార్త్ మ్యాన్’ లో ఒక దృశ్యం వుంటుంది. ఇందులో హీరో ప్రత్యర్దుల్లో ఒకడ్ని గుర్రంపై నుంచి కర్రతో కొట్టి కింద పడేస్తాడు.ఆ తర్వాత మరో శత్రువు గొంతుని నోటితో చీల్చి చంపుతాడు. తన తండ్రిని హత్య చేసిన మామపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన ఈ యువరాజు శత్రువుల్ని అత్యంత దారుణంగా నరుకుతాడు. సినిమా కళకి ఏకైక పూజ్యనీయ స్థానంగా వుంటున్న వెండి తెరని ఖరాబు చేస్తూ, ఎర్రటి రక్తాల్ని సునామీలా ప్రవహింపజేసి, అందులో చిందరవందరగా కొట్టుకుపోయే శరీర భాగాల్ని చూపిస్తూ- ఇది 10వ శతాబ్దపు 10వ వైకింగ్ ఇతిహాసమని సమర్ధించుకున్నాడు దర్శకుడు. ఇది బలహీన హృదయుల కోసం కాదని హెచ్చరించారు పాతిక్రేయులు.

2018 లో జెన్నిఫర్ కెంట్ అనే దర్శకురాలు తీసిన ‘ది నైటింగేల్’ లో,  తన కుటుంబాన్ని హతమార్చిన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే హీరోయిన్ రాక్షస చర్యలకి, క్రూర లైంగిక దాడులకి, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన ప్రేక్షకులు వాకౌట్ చేశారు.

ఇక స్టయిలిష్ మేకింగ్ చేస్తూ, అత్యాచారం-ప్రతీకారం కథతో, తొలిసారిగా దర్శకురాలైన కోరలీ ఫర్గీట్ 2017 లో  ‘రివెంజ్’ ని  రక్తసిక్త, పాత్రల మధ్యపిల్లీ –ఎలుకా చెలగాటపు థ్రిల్లర్ గా తీసి, ‘దీన్ని మించిన హింస వుంటుందా’ అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేసింది. దీనికి పాత్రికేయులు ‘ఈ హింసాత్మక ఫాంటసీని తట్టుకోగల ధైర్యవంతులైన కొద్దిమందిని ఉత్తేజపరిచేందుకు సిద్ధంగా వున్న వొక నీచమైన వినోదం’ అని బిరుదు తగిలించారు.

ఇంకా మదర్, వీడియోడ్రోమ్, ది హ్యూమన్ సెంటిపీడ్, టెట్సుయో: ది ఐరన్ మ్యాన్, యాంటీ క్రై స్ట్ వంటివెన్నో ఈ కోవలో వినోదం పేరుతో జుగుప్స కల్గించే సినిమాల జాబితాగా చెప్పుకోవచ్చు. ఐతే ఇవి హాలీవుడ్ సినిమాలు కావు. వరల్డ్ మూవీస్ కి పాశవిక పార్శ్వాన్ని చూపిస్తున్న యూరోపియన్ దేశాల ఉత్పత్తులే!

హాలీవుడ్ సినిమాల్లో ఈ స్థాయి హింస వుండదు. వాటిలో హింస ప్రధానంగా కథని ముందుకు నడిపించడానికి, న్యాయాన్ని స్థాపించడానికీ, లేదా కథానాయకుడి లక్ష్య సాధన కోసం ఒక సాధనంగా ఉపయోగపడుతూంటుంది. మంచి చెడుల నడుమ విభజన స్పష్టంగా వుంటూ,  హింస ద్వారా ఒక పరిష్కారం లేదా ఉద్వేగ ఉపశమనం లభిస్తుంది. దీనికి విరుద్ధంగా, యూరోపియన్ సినిమాల్లో  హింస మానసిక అశాంతిని, మానవ బలహీనతల్ని లేదా సమాజ క్షీణతని ప్రశ్నించడానికి వాడతారు.

హాలీవుడ్ శైలి చూస్తే, కథానాయకుడి ప్రతీకారం, విజయం యాక్షన్ ప్రధానంగా వుంటూ థ్రిల్ చేస్తాయి. యూరోపియన్ శైలి వచ్చేసి హింసణి ఒక సమస్యగా, సామాజిక వాస్తవికతగా, విశ్లేషణాత్మక కోణంలో చూపుతారు.

హాలీవుడ్‌‌లో హింసని అత్యంత స్టయిలిష్‌గా (గ్లామరస్ గా కూడా), వేగవంతమైన ఎడిటింగ్, నాటకీయ నేపథ్య సంగీతం, ఆకర్షణీయమైన యాక్షన్  కొరియోగ్రఫీలతో ఒక దృశ్య వినోదంలాగా మలిచి, బాక్సాఫీసులు నింపుకుంటారు.

యూరోపియన్ దర్శకులు మాత్రం నిడివి ఎక్కువ వుండే సింగిల్ టేక్స్ తో, ప్రశాంత నిశ్శబ్దంతో, అసహజ వాస్తవికతతో కూడిన అసౌకర్యవంత హింసని  చిత్రీకరిస్తూ, ప్రేక్షకుల్ని డిస్టర్బ్ చేస్తారు.

హాలీవుడ్ సినిమాలు భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వైభవాన్ని ప్రదర్శిస్తే, యూరోపియన్ సినిమా ముడి వాస్తవికతని ఎంచుకుంటాయి.

హాలీవుడ్ సినిమాల్లో  హింస తాలూకు దీర్ఘకాలిక మానసిక లేదా శారీరక క్షోభని చాలావరకు చూపించకుండా వదిలేస్తారు, లేదా తక్కువ చేసి చూపుతారు. కానీ యూరోపియన్ సినిమాల్లో హింస జరిగిన తర్వాత మిగిలే మానసిక క్షోభ, బాధితుడి వేదన, సమాజంపై దాని శాశ్వత ప్రభావాన్ని అత్యంత లోతుగా చూపిస్తారు.  

హాలీవుడ్‌లో రక్తపాతం తగ్గినప్పటికీ చంపడం సహజంగా అనిపిస్తుంది (సెన్సార్ నిబంధనల దృష్ట్యా), యూరోపియన్ సినిమాల్లో హింస ప్రభావం ప్రేక్షకులపై తీవ్రమైన మానసిక ముద్ర వేస్తుంది.

కొంతమంది దర్శకులు భయానక వాతావరణాన్ని సృష్టించడానికి, చారిత్రక వాస్తవాలని కళ్ళకి కట్టడానికి లేదా మానసిక సంఘర్షణల్ని వివరించడానికి గ్రాఫిక్ హింసని ఉపయోగిస్తూంటే, మరికొందరు కేవలం విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే వాడుతున్నారు. ఈ ధోరణి ఒక చర్చకి  దారితీసింది: కళాత్మక అవసరానికి, అనవసరమైన రక్తపాతానికీ మధ్య గీత ఎక్కడ వుంది? అలాగే, ఇలాంటి ప్రసిద్ధ సినిమా దృశ్యాలు ప్రేక్షకుల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

తెరపై హింస రెండు రకాలు: సందర్భోచిత హింస, వినోదపరమైన హింస. సినిమాల్లో చూపించే ప్రతి హింసా ఒకేలా వుండదు. సినిమా విమర్శకులు దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు: సందర్భోచిత హింస అంటే కథకి లేదా చరిత్రకి అవసరమైనది, అనవసర హింస అంటే కేవలం భయపెట్టడానికి లేదా థ్రిల్ పెంచడానికి వాడేది.

యుద్ధ వాస్తవికత అంటూ యూరోపియన్ సినిమాలు చూపించే భయానక హింసకీ, అదే యుద్ధ వాస్తవికత అంటూ హాలీవుడ్ చూపించే, ఆలోచింపజేసే హింసకీ తేడా విషయానికొస్తే,  స్టీవెన్ స్పీల్ బెర్గ్ 1998 లో తీసిన ‘సేవింగ్ ప్రైవెట్ రేయాన్’ చూడాలి.  ఈ రెండవ ప్రపంచ యుద్ధ కథలో ‘ఒమాహా బీచ్‘ ల్యాండింగ్ సీన్ అత్యంత భయానకంగా వుంటుంది. సైనికులు తుఫానులాంటి కాల్పుల్లో తునాతునకలవడం, కాళ్ళూ చేతులు విడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఇందులో కనిపిస్తాయి. అంటే యుద్ధాన్ని గొప్పగా చూపించకుండా, దానిలోని క్రూరత్వాన్ని, సైనికులు పడిన భయానక క్షణాలణి మాత్రమే కళ్ళకి కట్టడం ఉద్దేశం.

హాలీవుడ్ యుద్ధ దృశ్యాలు సమూహం మీద ఇంకో సమూహం చేసే దాడిగా విహంగ వీక్షణంగా వుంటే, యూరోపియన్ యుద్ధ సినిమాలో ప్రత్యక్ష్యంగా ఒక పాత్ర ఇంకో పాత్రని పట్టుకుని చిత్రహింసలు పెట్టి కిరాతకంగా చంపే మైక్రో లెవెల్ దృశ్యాలుంటాయి.

అలాగే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా 1972 లో తీసిన *ది గాడ్‌ఫాదర్* (1972) మానసిక భయాన్ని సృష్టిస్తుంది. ఈ మాఫియా కుటుంబపు మూవీలో మైఖేల్ కార్లియోన్ ఒక రెస్టారెంట్‌లో శత్రువుల్ని కాల్చి చంపే సామూహిక సన్నివేశం చాలా సహజంగా వుంటుంది. గ్లామర్ లేకుండా, చాలా గజిబిజిగా, అకస్మాత్తుగా జరిగే ఈ హింస.. మైఖేల్ అనే సాధారణ యువకుడు ఒక నేరస్థుడిగా ఎలా మారాడో తెలిపే కీలక మలుపుని సూచిస్తుంది.

సినిమాల్లోని ఈ స్పష్టమైన రక్తపాతంపై మానసిక నిపుణులు, సెన్సార్ బోర్డులు, ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే వుంటుంది. ఒకవైపు, ఇలాంటి కాల్పనిక హింస మనుషుల్లోని కోపాన్ని, ఉద్రిక్తతనీ సురక్షిత వాతావరణంలో బయటపెట్టడానికి ఒక మార్గమని కొందరు వాదిస్తారు. మరోవైపు, నిరంతరం ఇలాంటి హింసాత్మక దృశ్యాలు చూడ్డం వల్ల నిజ జీవితంలో జరిగే నష్టాలపై  స్పందించే గుణం తగ్గిపోతుందేమోనని, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్ హింస అనేది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు– అది దర్శకుడి ఉద్దేశాన్నిబట్టి, కథా సందర్భాన్ని బట్టీ మారుతుంది. ఒక్కటి మాత్రం విస్మరించలేని ఆధారంగా వుంటుంది. అదేమిటంటే, ప్రేక్షకుల్ని బెదరగొట్టకుండా, అదిరే యాక్షన్ కోరియోగ్రఫీతో, బాక్సాఫీసుకి ఢోకా లేకుండా ఎంటర్టయిన్ చేయడం.

-సికిందర్

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate