* ఆర్మీలో కీలకపాత్రధారే ‘ నీమ్ కరోలీబాబా’ పాత్రధారి…
* విశిష్ట సేవా మెడల్ గ్రహీత
ఇటీవల విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన నీమ్ కరోలీ బాబా జీవితకథా చిత్రం ‘ హనుమాన్ అన్శ్ ’ సినిమాలో ఆ బాబా పాత్రలో రాణించిన వ్యక్తి భారత సైన్యంలో నిఘా అధికారిగా పనిచేసిన మునీశ్వర్ నాథ్ బక్షి . ఆయనను అందరూ కల్నల్ హన్నీబక్షి అని వ్యవహరిస్తారు. డెహ్రాడూన్ లోని మిలిటరీ ఇంజినీరింగ్ కాలేజ్ లో శిక్షణ పొందిన బక్షి 1988లో మిలటరీ ఇంటెలిజెన్స్ దళంలో చేరారు. కీలకమైన రాష్ట్రాల్లో ఆయన సైనిక నిఘా అధికారిగా పనిచేశారు. జనరల్ వి.కె.సింగ్ ఆర్మీ అధికారిగా ఉన్న సమయంలో ఆయన టెక్నికల్ సపోర్ట్ డివిజన్ (టిఎస్ డి)లో కమాండర్ గా చాలాకాలం పాటు బాధ్యతలు నిర్వర్తించారు. చాలావరకు కోవర్టు ఆపరేషన్లు నిర్వహించారు. సైన్యంలో సేవలకు గాను ఆయనకు విశిష్ట సేవా మెడల్ (విఎస్ఎం) లభించింది. నిఘా అధికారిగా రహస్యంగా పనిచేస్తున్నపుడు మూడుసార్లు జరిగిన దాడుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. జనరల్ వి.కె.సింగ్ రిటైరయిన తర్వాత టిఎస్ డి రద్దయింది. అనంతరం ఇతర విభాగంలో బక్షి పనిచేశారు. అయితే ఎంత బాధ్యతాయుతంగా పనిచేశాడో అన్ని ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. సైనిక ఆపరేషన్ల గురించి బాహాటంగా మాట్లాడుతున్నాడని, రహస్య నిధుల వినియోగంపై సరైన లెక్కలు లేవనే ఆరోపణలతో బక్షిపై విచారణ ( కోర్టుమార్షల్ ) కూడా జరిగింది. అవేవీ రుజువు కాకపోవడంతో 2018లో ఆ అభియోగాలన్నిటి నుండి బక్షికి విముక్తి లభించింది. మరో ఏడాది పాటు సైన్యంలో పనిచేశాక 2019లో ఆయన స్వచ్ఛంద విరమణ పొందారు. చిత్రదర్శకుడు విశాల్ చతుర్వేది ఆయనకు నీమ్ కరోలీ బాబా పాత్ర ఆఫర్ చేసి ఆహార విహారాల గురించి కొన్ని ఆంక్షలు పాటించాలని సూచించారు. బక్షి అలాగే చేశారు. ఈ సినిమా హిట్టయ్యాక ఆయనకు మరింత పెద్ద పాత్రలు వస్తాయని ఆశిస్తున్నారు.
