Pan IIT Alumni India appeals
Professionals
భారత్ కు వెంటనే తిరిగిరండి !
ఐటి ప్రొఫెషనల్స్ కు, మేధావులకు ఐఐటి అల్యుమ్ని పిలుపు
న్యూఢిల్లీ ; ఇన్నాళ్లు భూతల స్వర్గమని భావించిన అమెరికా ఇక ఎంతమాత్రం అలాంటిది కాదని రూఢీ అయిందని, వెంటనే స్వదేశానికి తిరిగిరావాలని ఐఐటి పూర్వవిద్యార్థుల సంఘం భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇతర ప్రొఫెషనల్స్ కు విజ్ఞప్తి చేసింది. దశాబ్దాలుగా భారతీయ మేధావులు అమెరికా అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని దానిని ఏమాత్రం గుర్తించకుండా సందర్భం వచ్చినప్పుడల్లా మనకు అన్యాయం చేస్తూ, అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నారని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయ మేధావులు కళ్లు తెరిచి స్వదేశానికి తిరిగివచ్చి ఇక్కడ అభివృద్ధికి పాటుపడాలని కోరింది. భారత్ కు చెందిన ఎనిమిది ప్రధాన ఐటి కంపెనీల లేబర్ లైసెన్స్ లను అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో పాన్ ఐఐటి అల్యుమ్ని శుక్రవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది.
విప్రో,ఇన్ఫోసిస్,టిసిఎస్,హెచ్ సిఎల్,క్యాప్ జెమ్ని వంటి ప్రముఖ ఐటి కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పెర్మ్) ను అమెరికా రద్దు చేసింది. అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ ప్రకటనతో గ్రీన్ కార్డు అప్లికేషన్స్ అన్నీ ఆగిపోనున్నాయి. ఈ చర్య వల్ల
భారతీయ ఐటి దిగ్గజ కంపెనీలకు, ఐటి నిపుణులకు , భారతీయులకు భారీ నష్టం వాటిల్లనుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సమక్షంలోనే అమెరికా అధికారులు ఈ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే.
ఇక విదేశీ కలలు చాలించి స్వదేశానికి తిరిగివచ్చే తరుణం ఆసన్నమైందని, ఇంకా అమెరికా చూరు పట్టుకొని వేలాడవద్దని భారతీయ నిపుణులందరికీ ఐఐటియన్ల సంఘం విజ్ఞప్తి చేసింది.వీసా ఎప్పటికీ వీసాయేనని అది శాశ్వతం కాదని ఈ వారం రోజుల పరిణామాలు నిరూపించాయని పాన్ ఐఐటి అల్యుమ్నిఅధ్యక్షుడు ఐఆర్ఎస్ అధికారి ప్రభాత్ కుమార్ అన్నారు.ఈ అల్యుమ్నిలో దేశంలోని 23 ఐఐటిలకు చెందిన విద్యార్థులకు సభ్యత్వం ఉంది. అమెరికాలో భారతీయ మేధావులు ఎన్నో పరిశోధనలు చేశారని, పేటెంట్లు సాధించిపెట్టారని, ఎన్నెన్నో కొత్త ఉత్పత్తులు తీసుకురాగలిగారని,అక్కడి పారిశ్రామిక ప్రగతిలో భారతీయుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన వివరించారు. అయినప్పటికీ భారతీయులను వెట్టిచాకిరి జీతగాళ్లుగానే అమెరికా చూసింది. ఇంకా చూస్తోందన్నారు. వేతనాల్లో, ఉద్యోగాల్లో సరైన న్యాయం చూపడం లేదన్నారు. అందుకే సొంతగడ్డకు వచ్చి ఇక్కడి సవాళ్లకు, సమస్యలకు పరిష్కారం చూపి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. దీనిని తిరస్కారంగా భావించడం కన్నా భారత్ కు స్వాగతంగా భావించాలని ఆయన సూచించారు. ఎన్నో కలలతో అమెరికా వెళ్ళిన వారికి ఈ పరిణామాలు కనువిప్పు కలిగించాలని ఐఐటి అలుమ్ని ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టులో ప్రభాత్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా కార్మికశాఖ ప్రకటనను, అందులో వాడిన భాషను భారత విదేశీవ్యవహారాల శాఖ కూడా తప్పుపట్టింది. ఇది బాధాకరమని వ్యాఖ్యానించింది.
