Articles & Opinion

NO Permission for TRI COLOUR FLAGS

At Central Park.

సెంట్రల్ పార్క్ మూసివేత

తిరంగాజెండాల ప్రదర్శనకు ‘ నో ’

న్యూఢిల్లీ ; దేశరాజధానిలో ప్రముఖ వాణిజ్యకేంద్రమైన కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం (16న) సిజెపి తలపెట్టిన జాతీయజెండాల ప్రదర్శన, జాతీయగీతాలాపనకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. 11 మందికి మాత్రమే అనుమతిస్తామని, పౌరులెవరూ ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాకూడదని వారు ఆదేశించారు. పాలనాకారణాల వల్ల సెంట్రల్ పార్క్ నే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్టు వారు తెలిపారు. ఎన్నికల అక్రమాలకు నిరసనగా, సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద సిజెపి, ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆందోళనకారులను పెద్దసంఖ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్, ఎంపి ప్రియాంకలతో పాటు, నలుగురు మాజీ ముఖ్యమంత్రులను కూడా పోలీసులు నిర్బంధించారు. దీంతో సిజెపి తన వ్యూహాన్ని మార్చుకుంది. జంతర్ మంతర్ వద్ద కాకుండా ఈసారి కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ వద్ద జాతీయజెండాలతో ప్రదర్శన జరపాలని పిలుపునిచ్చింది.

 అక్టోబర్ 16న సాయంత్రం ఐదు గంటలకు ప్రజలంతా జాతీయజెండాలు చేబూని రావాలని సిజెపి పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం డైలమాలో పడ్డాయి. ఈలోగా కన్నాట్ ప్లేస్ లో వీథివ్యాపారి ఒకరు ఈ ప్రదర్శన జరుగకుండా చూడాలని, తమ వారాంతపు వ్యాపారం దెబ్బతింటుందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని విచారించిన హైకోర్టు నిరసన ప్రదర్శనను అడ్డుకోలేమని తెలిపింది. కావాలంటే అది తప్పుదారి పట్టకుండా పోలీసులు నియంత్రించవచ్చునని, అంతేకాని జాతీయపతాకాల ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించలేమని పోలీసు శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ కోర్టు ఆదేశాలను ఆసరాగా  చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఈ ప్రదర్శనకు 11 మందికే అనుమతి ఇస్తామని ప్రకటించారు. పెద్దసంఖ్యలో పౌరులు పార్క్ వద్ద గుమిగూడడానికి, జాతీయ జెండాలతో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేమని ఆంక్షలు విధించారు. కావాలంటే ఓ 11 మంది వచ్చి జాతీయజెండాలతో జాతీయగీతాలాపన చేసుకోవచ్చునని తెలిపారు.

   ఒక్క వ్యక్తి కోసమా..?  వందచోట్ల చేస్తాం..; అభిజిత్ దిప్కే

   దీనికి ప్రతిస్పందనగా సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ ఒకే ఒక్క వ్యక్తి సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను  కాపాడడానికి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క కన్నాట్ ప్లేస్ లో ఆంక్షలు విధించినంత మాత్రాన తమ ఆందోళన ఆగదన్నారు. దేశవ్యాప్తంగా వందచోట్ల ఇలాంటి ప్రదర్శనలు చేస్తామని, అంతటా జాతీయజెండాలతో నిరసన తెలిపి, జాతీయగీతాలాపన చేస్తామని దిప్కే అన్నారు. అన్ని చోట్లా అనుమతి నిరాకరిస్తారా…ఆంక్షలు విధిస్తారా చూస్తామన్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో జరిగే మువ్వన్నెల జెండా ప్రదర్శనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సిజెపి గురువారం ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో దిప్కే తోపాటు నేహాబోరా, ప్రకాశ్ రాజ్, ప్రముఖ న్యాయవాది ఎంపి కపిల్ సిబల్ తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating