West Bengal సలహాదారుగా మిథున్ చక్రవర్తి !
కోల్ కతా ; ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి పశ్చిమబంగ రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకుతో ఆయనను సలహదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. హిందీ, బెంగాలి, ఒడిస్సీ,భోజ్ పురి, తెలుగు భాషల్లో దాదాపు 350కి పైగా సినిమాల్లో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. భారతీయ సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 1976లో ‘మృగయా ’ చిత్రంలో ఆయన నటనకు ‘జాతీయ ఉత్తమ నటుడు అవార్డు’ లభించింది.
డిస్కోడ్యాన్సర్ చిత్రంతో ఆయన పేరు ఇంటింటా మారుమోగిపోయింది. సురక్ష, ప్యార్ జుక్తా నహీ, ఫూల్ ఔర్ అంగార్, కస్మేవాదే, కమాండో, ముజ్రిమ్, అగ్నిపథ్, ఘర్ ఏక్ మందిర్, గోల్ మాల్ 3, ది.కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. కాగా చక్రవర్తి నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని, మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యేవరకు ఆయన సలహాదారు పదవిలో కొనసాగుతారని లోక్ భవన్ ప్రకటన తెలిపింది. తనను సాంస్కృతిక సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి శుభేందు అధికారికి మిథున్ కృతజ్ఞతలు తెలిపారు. 2014లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. టిఎంసి రాజ్యసభ సభ్యునిగా రెండేళ్లపాటు వ్యవహరించి 2016లో రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. అనంతరం 2021లో మళ్ళీ బిజెపి లో చేరి చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు.
