- ప్రజాసేవకు ఉద్యోగమే అడ్డు
- ప్రగతికి మోకాలడ్డుతున్న నేతాశ్రీలు..
లక్నో ; అఖిలభారత సర్వీసు అధికారిగా పనిచేస్తున్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదనతో దానికి గుడ్ బై కొట్టేశారు దివ్యామిట్టల్. ఐఎఎస్ అయితే ఎన్నో చేయవచ్చు, జిల్లా కలెక్టర్ గా ఉంటే ఎంతో మార్పు తీసుకురావచ్చని ఆమె కన్న కలలు కల్లలు కావడంతో ఆ ఉద్యోగానికి రిజైన్ చేశారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్నది కుళ్ళు రాజకీయాలేనని, అందుకే వాటిని ప్రక్షాళన చేయాలని, అప్పుడే సమాజాభ్యున్నతి సాధ్యమవుతుందని ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారిణి అయిన దివ్యామిట్టల్ తెలిపారు. 2013లో ఐఎఎస్ గా ఎంపికైన ఆమెకు 13 ఏళ్ల సర్వీసు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. అందుకే ఇంకా ఎంతో సర్వీసు మిగిలి ఉన్నా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మనసుంటే మార్గముంటుందంటారు. కాని మనసు లేకపోవడమే ఈ దేశానికి పట్టిన జాఢ్యమన్నారు. చిత్తశుద్ధి ఉంటే కొండలు కూడా పిండి అవుతాయని, అది లేకుంటే చిన్న దరఖాస్తు కూడా కొండలా నిలబడుతుందన్నారు.
ఆమె ఉద్యోగానికి రిజైన్ చేయగానే ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరుతారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. వీటిని నిజం చేస్తూ, తన రాజీనామా ఆమోదం పొందగానే ఆమె ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు. తాను యుపి రాజకీయాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతకీ ఏ పార్టీలో చేరుతున్నారని ప్రశ్నించగా, ఏ పార్టీలో చేరేది లేదు. ప్రజాసేవలో మాత్రం చురుకుగా పాల్గొంటానన్నారు. ఆమె దేవరియా, మీర్జాపూర్ జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. తన సర్వీసులో ఉండగా, మారుమూల ప్రాంతాలకు పైపుల ద్వారా మంచినీటి సదుపాయాన్ని కలిగించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, సామాన్యులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలేవీ ప్రస్తుత వ్యవస్థలో పరిష్కారం త్వరగా కావడం లేదన్నారు. సామాజిక న్యాయం, జవాబుదారీ తనం లోపించిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయినా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందని ఆమె విచారం వ్యక్తం చేశారు. తాను ఐఎఎస్ అయినా ఏమీ చేయలేకపోయానన్నారు. ఒక గ్రామానికి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల మంజూరు చేస్తే నిధులున్నా, స్థలం ఉన్నా మూడేళ్ళు గడిచినా నిర్మాణమే ప్రారంభం కాకపోవడం తనను బాగా కలచి వేసిందన్నారు. అందుకే కలెక్టర్ నయినా ఏమీ చేయలేక చేతులు ముడుచుకోలేక బయటపడ్డానని దివ్యా మిట్టల్ వివరించారు. ప్రస్తుత రాజకీయాల్లో చిత్తశుద్ది కన్నా మిగిలిన చెత్త ఎంతో ఉందన్నారు. తన ముందు అనేక సవాళ్లున్నాయని, అందుకే ఎక్కడ నుండి ఆరంభించాలి, ఎలా ఆరంభించాలనేది యోచిస్తున్నానని ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
