‘ రామాయణ్ ’ నిర్మాతపై ఐ.టి దాడులు
- నమిత్ మల్హోత్రా ఆస్తుల 16 వేల కోట్లు !
ముంబయి ; ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ‘రామాయణ్ ’ నిర్మిస్తూ వార్తల్లో కెక్కిన నమిత్ మల్హోత్రా ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. బుధవారం తెల్లవారు జామునుంచే మల్హోత్రా ఆఫీస్ ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ లో ఐటి అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. వచ్చే దీపావళికి ఆయన సినిమా ‘రామాయణ్ ’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆయన కార్యాలయమేగాక, ఇతర అనుబంధ కార్యాలయాలపై, దాంతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాల్లో కూడా ఈ దాడులు జరిగాయి. ప్రైమ్ ఫోకస్ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. విదేశాల నుంచి జమ అయిన డబ్బు గురించి ఐటి అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. రణబీర్ కపూర్,సాయిపల్లవి, యశ్ తదితరులు నటిస్తున్న రామాయణ్ నిర్మాణానికి దాదాపు 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిసిందే.
నమిత్ మల్హోత్రా అనతి కాలంలోనే తన చిత్రాల ద్వారా, విజువల్ ఎఫెక్ట్స్ కార్యకలాపాల ద్వారా వేల కోట్లు సముపార్జించారు. బ్రిటిష్ విఎఫ్ ఎక్స్ కంపెనీ డిఎన్ఇజిని ఆయన కొనుగోలు చేయడంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. 1997లో ఒక చిన్న గ్యారేజీలో ఆయన ప్రారంభించిన ప్రైమ్ ఫోకస్ కంపెనీ 2014లో డిఎన్ఇజి కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఆస్కార్ అవార్డులు సాధించిన పలు సినిమాలకు ఆయన కంపెనీ విజువల్ ఎఫెక్ట్స్ అందించింది.