Articles & Opinion

   EC Issues FRESH DIRECTIONS

    For SSR

    ఎస్ఐఆర్ గొడవ అటుండగానే ఎస్ఎస్ఆర్

  • 17 రాష్ట్రాల్లో జనవరి 4న ఓటర్ల తుది జాబితా
  • ఇసి తాజా ఆదేశాలు జారీ  

న్యూఢిల్లీ ; దేశమంతటా ఎస్ఐఆర్ గొడవ సద్దుమణగకముందే ఎన్నికల సంఘం తాజాగా 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక పునశ్చరణ (ఎస్ఎస్ఆర్) చేపట్టాలని నిర్ణయించింది. అర్హుడైన ఏ ఒక్క పౌరుని ఓటు జాబితా నుంచి గల్లంతు కాకూడదని, అనర్హులెవరికీ ఓటర్ల జాబితాలో చోటు ఉండరాదని సూచించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు బాధ్యత వహించాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఐఆర్ పై రగడ జరుగుతుండడంతో ఓటర్ల నమోదులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు పేర్కొంది.

 అస్సాం, బిహార్, చత్తీస్ గఢ్,గుజరాత్,గోవా,కేరళం,లక్షద్వీప్, మధ్యప్రదేశ్,మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, యుపి, ఉత్తరాఖండ్, బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ప్రత్యేక ఓటర్ల జాబితాపునశ్చరణ జరపాలని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి లోగా ఈ జాబితా తయారు కావాలని, నాలుగున విడుదల చేస్తామని ప్రకటించింది. ఓటర్ల జాబితా ఆధారంగా పోలింగ్ స్టేషన్ల నిర్ధారణ  ఈ ఏడాది నవంబర్ రెండున జరగాలని, 12న జాబితా ముసాయిదా తయారు కావాలని, నెలరోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని డిసెంబర్ 11 లోగా వీటిని స్వీకరించి 28లోగా పరిష్కరించాలని కూడా సూచించింది.

    ఇప్పటికే ఎస్ఐఆర్ జరుగుతున్న ఎపి,తెలంగాణ, కర్ణాటక,మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానాల్లో ఈ ఎస్ఎస్ఆర్ ప్రక్రియను తర్వాత ప్రకటిస్తామని ఇసి తెలిపింది. కాగా ఈ ప్రక్రియ ముగిసేలోగా జిల్లా ఎన్నికల అధికారులను, రిటర్నింగ్ అధికారులను, ఇందులో పాల్గొనే ఇతర సిబ్బందిని  బదిలీ చేయకూడదని కూడా ఆదేశించింది.   

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating