Articles & Opinion

EC Gyaneshwar Resignation Temporary Relief ! జ్ఞానేశ్ రాజీనామా తాత్కాలిక ఉపశమనమే !

  • పాపం సిఇసికి ఎన్ని నిద్రలేని రాత్రులో..
  • ఆయన పావుమాత్రమే..అప్రూవర్ గా మారితే మేలు..

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా ఉంది. అధికార,ప్రతిపక్షాల మధ్య ఆయన అడకత్తెరలో పోకలా నలిగిపోతున్నాడు. ఆయన ముందు రెండే రెండు మార్గాలున్నాయిప్పుడు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగలేదని సాక్ష్యాధారాలతో నిరూపించి ఆందోళనకారుల నోళ్లు మూయించడం ఒకటి. తానే నోరు విప్పి తనతో ఇన్ని దారుణాలు చేయించిన వారి బండారం బట్టబయలు చేసి కుర్చీదిగి వెళ్లిపోవడం రెండవది. ఇప్పటివరకు వెలుగు చూసిన ఆధారాలను పరిశీలిస్తే మొదటి అవకాశం లేనట్టే. ఇక మిగిలింది రెండవదే. ఇన్నేళ్ళ సివిల్ సర్వీసులో ఆయన ఇంతలా ఒత్తిడికి గురైన సందర్భం కాని, నిద్రలేని రాత్రులు కాని లేవు. ఆయన ఉద్వాసనకు దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక అత్యున్నత అధికారిని కుర్చీ నుంచి దిగిపోవాలని డిమాండ్ చేయడం, ఈ 8 దశాబ్దాల స్వాతంత్ర్యభారతంలో ఇదే తొలిసారి. అసెంబ్లీల ఎదుట, సెక్రటేరియట్ల ఎదుట జిల్లా కలెక్టరేట్ల వద్ద, పార్లమెంట్ ఆవరణలో వివిధ అంశాల మీద ధర్నాలు, ఆందోళనలు, నిరశన దీక్షలు జరగడం ఎన్నో మనం చూశాం. కాని ఒకే ఒక్క అంశంపై దేశమంతా ఆందోళనలు జరగడం, ఎన్నికల కమిషన్ కార్యాలయం ( నిర్వాచన్ సదన్ ) వద్ద ఇంత భద్రత, ఇంత బందోబస్తు కల్పించడం ఇదే తొలిసారి. బిజెపి మూడవసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పు ఇదే. దేశంలో ప్రబలిన అసహనానికి పరాకాష్ఠ ఇది. దీనికి పూర్తి బాధ్యత కేంద్రసర్కార్ దే. దేశరాజధానిలో మెట్రోసేవలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత , ట్రాఫిక్ ఆంక్షలు, నలుగురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు వేలాది మందిని అరెస్ట్ చేయడం వంటివన్నీ నగరవాసులతో పాటు దేశపౌరులకు చాలా ఇబ్బందిగా పరిణమించాయి.

      బలిపశువుగా మారాడు..

 వీటన్నిటికి కేంద్రబిందువు గా కనిపిస్తున్న వ్యక్తి సిఇసి జ్ఞానేశ్ కుమార్. ఎన్నికల కమిషనర్ గా నియమిస్తానంటే ఆయన పాపం అత్యున్నత పదవి లభిస్తున్నదని ఆశపడి ఉండవచ్చు. కాని ఇంతలా దేశం యావత్తు ఆగ్రహించే పనులు చేయబోతున్నట్టు ఆయన ఊహించి ఉండరు. ఇంత అపకీర్తిని, అప్రతిష్ఠను మూటగట్టుకొని కుర్చీలో కూర్చోవాల్సి వస్తుందని అనుకొని ఉండరు. ఎన్నికల డేట్ల విషయంలోనో, ప్రచార సమయాల విషయంలోనో అధికారపార్టీ వారు చిన్నచిన్న ఫేవర్ లు అడుగుతారని ఆయన అనుకొని ఉంటారు. కాస్తా చూసీచూడనట్లు ఉంటే సరిపోతుందనుకున్నారేమో. ఇది నా అమాయకత్వమూ కావచ్చు.

 నిజానికి ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితాలో సవరణలు, పోలింగ్ దశల పెంపు, పోలింగ్ కు సంబంధించిన నిర్ణయాల్లో కేంద్రీకృత విధానాలు ఆయన సొంతబుర్రలో పుట్టినవి కావని దేశంలో చిన్నపిల్లాడికైనా తెలుస్తుంది.

  వార్తలు వింటున్నవాళ్లకు, రాజకీయాలను గమనిస్తున్నవాళ్ళకు ఈ సంగతి విడమర్చి చెప్పనవసరం లేదు. కాని తన వెనక ఉన్నవాళ్ళు చేయమన్నట్టల్లా  చేసినందుకు , అది కూడా పరిధులు దాటినందుకు, ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీసినందుకు ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఆయనను అధికార పార్టీ  ఇంతలా వాడుకుంటుందని గాని, మొత్తం దోషాలన్నీ తనమీదనే పడుతాయని కాని, బలిపశువును తానే అవుతానని కాని జ్ఞానేశ్ కలలో కూడా అనుకోలేదేమో. లేక అన్నీ తెలిసే దిగారేమో తెలియదు. దేశద్రోహిగా ముద్రపడి ఎసిలో ఉన్నా ఆయనకు చెమటలు పడుతూనే ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని అవమానాలు. ఓట్లు గల్లంతయినవారు, ఇసి చర్యల వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా నష్టపోయినవాళ్ళు, ఓడిపోయినవాళ్లు, వారి కుటుంబాలు తిట్టే తిట్లు, పెట్టే శాపనార్థాలు ఆయనకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఆయన మనశ్నాంతిని పూర్తిగా కోల్సోవాల్సి వచ్చింది.

 కుటుంబానికీ తీరని వేదన

ఈ పరిణామాలు జ్ఞానేశ్ కుటుంబ సభ్యులకు కూడా ఎంత మనోవేదన కలిగిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆయన సోదరులు, కూతుళ్లు, అల్లుళ్లు సొంత ప్రతిభతో ఉద్యోగాలు పొందినవాళ్లు, తమ మానాన తాము పనిచేసుకునే వాళ్లు ఎంత మానసిక క్షోభ పొందుతారు. ఉన్నదో లేనిదో తిని కంటినిండా నిద్రపోవాలనుకునే ఆయన కుటుంబ సభ్యులకు తీరని వ్యధ కలుగడం లేదా.?.

అయితే నేనేదో జ్ఞానేశ్ కుమార్ నిరపరాధి అని నిర్దోషి అని వాదించడం లేదు. కాని సమస్యను ఇంకో కోణం నుంచి చూస్తూ, ఆయన నిస్సయతను పాఠకులకు కూడా  కూడా చూపించే యత్నమే ఇది. పైకి నిర్మలంగా కనిపించే కమలం లా ఉంటుందని దిగిన ఆయనకు అది బురద అని అర్థమయ్యేలోపే అందులో పూర్తిగా కూరుకుపోయాడు. ఇక బయటికి రావడం సాధ్యం కావడం లేదు. బయటికి రావడం ఆయనకు ఇష్టమా కాదా తెలియదు. ఒకవేళ రావాలనుకున్నా ఆయనను నియమించినవాళ్లు రానివ్వరని నా భావన.

 కాగా, ఇసి వ్యవహారాలకు పూర్తి బాధ్యత జ్ఞానేశ్ పైనే మోపడం సరికాదని నా అభిప్రాయం. ఎస్ పి నాయకురాలు డింపుల్  యాదవ్ చెప్పినట్టు ఈ పాపంలో అందరికీ భాగం ఉంది. ఒక్క జ్ఞానేశ్ ను మాత్రమే నిందించి ప్రయోజనమేమిటి ?. ఆయన నిమిత్త మాత్రుడు. జ్ఞానేశ్ రాజీనామా చేస్తే మరో విఘ్నేశ్ ఆ సీట్లో కూర్చుంటాడు . కొత్త సిఇసి మాత్రం ఎంతవరకు పనిచేయగలడు. కాబట్టి ఆయనను నియమించిన వారి బుర్రలో ఉంది కదా ఈ పైత్యం. వారిది కదా ఈ దుర్మార్గం.

జ్ఞానేశ్ రాజీనామా తాత్కాలిక ఉపశమనమే. శాశ్వత పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యం నిలబడడానికి ఏమీ ఉపయోగపడదు. ఎవరు సీట్లో కూర్చున్నా నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినప్పుడే కదా జనతంత్రానికి బలం. అయితే ఇప్పుడు సిఇసి రాజీనామా వద్దని నేను కోరడం లేదు. ఆయననే కొనసాగించాలనీ అనడం లేదు. జ్ఞానేశ్ నిమిత్తమాత్రుడే, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినవారి చేతిలోని కత్తి మాత్రమే . కత్తిని వదిలించుకున్నంత మాత్రాన ముప్పు తొలగినట్టు కాదు. కోర్టులో ‘ఎగ్జిబిట్ నంబర్ వన్’ అవుతారు. సిఇసి అప్రూవర్ గా మారి దేశద్రోహి అనే ముద్రను, తనకంటిన బురదను కొంతవరకైనా కడుక్కునే ప్రయత్నం చేయడం మేలు. ఇదిలా ఉండగా, ఎన్నికల అవకతవకలపై దేశం ఇంత అట్టుడికిపోతుంటే కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొంది. అంతేగాక రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటున్న నీరో చక్రవర్తిలా ప్రధాని నరేంద్రమోడీ పాతికేళ్ల పాలనపై సంబరాలు ప్రకటిస్తూ కేంద్రకేబినెట్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేస్తున్నాయి. 

                                              – సతీశ్ .కె.కె. (సీనియర్ జర్నలిస్ట్ )                         

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating