JAN NEETI BHARATH
దివ్యామిట్టల్ పార్టీ జెఎన్ బి
- యుపి అసెంబ్లీతో అరంగ్రేట్రం
లక్నో ; ఐఎఎస్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పిన దివ్యామిట్టల్ తానే కొత్త పార్టీ పెడుతున్నట్టు దాని పేరు ‘ జన నీతి భారత్ ’ (జెఎన్ బి) గా తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. వచ్చే ఏడాది యుపిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమె తెలిపారు. ఎన్నికల్లో వాగ్దానాలకే పరిమితం కాకుండా ఐదేళ్ల పాటు జనానికి జవాబుదారీగా ఉండడమే తమ పార్టీ ధ్యేయమని ఆమె చెప్పారు. ఆమె రాజకీయాల్లో చేరుతున్నట్టు 20 రోజుల కిందటే ‘తూటా’ వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలను ప్రస్తుతం రాజకీయాలు శాసిస్తున్నాయని, తమ పార్టీ జెఎన్ బి లో మాత్రం రాజకీయాలను శాసించే స్థితికి ప్రజలుంటారని ఆమె వివరించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించగానే ప్రజలనుండి అనూహ్య స్పందన వస్తోందని, తనకు మద్దతు తెలుపుతూ వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు.
‘రాజ్ నీతి వద్దు..జననీతి ముద్దు’ అనేది తమ పార్టీ నినాదమని ఆమె తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీలకు కొదువ లేదని, అయితే ప్రజల గోడు వినే పార్టీలే తక్కువ అని అన్నారు. ఆర్బాటపు ప్రచారానికి తమ వద్ద డబ్బులేదని, ప్రతి మద్దతుదారుడే తమ ప్రచారకర్త అవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారానికే తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆమె ఐఎఎస్ అధికారిణిగా మంచి పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత హాలియా తాలూకాలో తాగునీటి సదుపాయం కల్పించడం ఆమె హయాంలోనే సాధ్యమైంది.
ఢిల్లీ ఐఐటిలో, బెంగళూరు ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దివ్యామిట్టల్ అనంతరం ఐఎఎస్ కు ఎంపికై యుపిలో అనేక కీలకపదవులను నిర్వహించారు.
