యుపి దళిత ఓట్లపై చిరాగ్ కన్ను
- అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో సీట్ల సర్దుబాటు
- వంద సీట్లలో ప్రభావం ?
లక్నో ; లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జె.పి) వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇటీవల యువతరం కోసం కేంద్రమంత్రి ఎల్ జెపి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిర్వహించిన ర్యాలీలకు మంచి స్పందన వచ్చింది. దీంతో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని ఆయన నిర్ణయించారు. ఇటీవల తన తండ్రి, ఎల్ జెపి వ్యవస్థాపకుడైన రాంవిలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా యుపి రాజధాని లక్నోలో ఆయన నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరయ్యారు. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో పాసవాన్ వర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 403 కాగా దాదాపు వందకుపైగా సీట్లలో ఈ పాసవాన్ వర్గపు ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈ వర్గపు ఓట్లపై కన్ను వేసిన చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్రంలో తన పార్టీ బలాన్ని తద్వారా తన పలుకుబడిని పెంచుకోవాలనుకుంటున్నారు. అయితే బిజెపితో సీట్ల సర్దుబాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సొంతగా పోటీ చేస్తే తనకు బలం పెరగకపోగా, బిజిపి విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే తక్కువ సీట్లలోనైనా పొత్తు కుదుర్చుకునే పోటీ చేసేందుకు చిరాగ్ ఆసక్తి చూపుతున్నారు.
