Articles & Opinion

    CEC జ్ఞానేశ్ పై ఫోర్జరీ కేసు ?

     *తృణమూల్ ఎంపీ మహువా డిమాండ్

    *ఢిల్లీ పిఎస్ లో ఫిర్యాదు

న్యూఢిల్లీ ; భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ పై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (మమతవర్గం) సీనియర్ ఎంపీ మహువా  మెయిత్రా డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె దేశరాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్ లో మిగిలిన ఇద్దరి అభిప్రాయాలు, అసమ్మతి నోట్ లు పట్టించుకోకుండా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నట్టు సిఇసి జ్ఞానేశ్ కుమార్ అసత్యాలు చెప్పారని ఆమె ఆరోపించారు. మరో ఇద్దరి నిర్ణయాలకు భిన్నంగా ఆయన వ్యవహరించి వారి సమ్మతి కూడా ఉన్నట్టు నమ్మబలికారని అందుకే సిఇసి పై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని ఆమె అన్నారు. ఈమేరకు తన ఫిర్యాదుకు మద్దతుగా 44 పేజీల డాక్యుమెంట్లు సమర్పించారు.

కమిషన్ లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం, మరో ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలు పట్టించుకోకుండానే, కమిషన్ ఆదేశాలుగా ప్రకటించే  అధికారం జ్ఞానేశ్ కు లేనే లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ చర్య భారతీయ న్యాయ సంహిత (బిఎన్ ఎస్)లోని 335,336 సెక్షన్ల ప్రకారం ఫోర్జరీ కిందకు వస్తుందన్నారు. సెక్షన్ 340 కింద జ్ఞానేశ్ శిక్షార్హుడని ఆమె తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల జాబితాను ఇష్టం వచ్చినట్టు మార్చే అధికారం సిఇసికి లేదన్నారు.

ఎన్నికల కమిషన్ లో మిగిలిన ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషి, సుఖబీర్ సింగ్ సంధు పదినెలల వ్యవధిలో మొత్తం 14 సార్లు అభ్యంతరాలు తెలిపినా, అసమ్మతి నోట్ లు సమర్పించినా వాటిని జ్ఞానేశ్ ఏ మాత్రం ఖాతరు చేయలేదని, తన ఒక్కడి అభిప్రాయమే ఇసి అభిప్రాయంగా దేశ ప్రజలను నమ్మించారని ఆమె దుయ్యబట్టారు. అందుకే ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టాలన్నారు.

       ………………………………..

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating