విధానమండలి ఎన్నికల్లో బిజెపి గెలుపు
- కర్ణాటకలో కాంగ్రెస్ కు షాక్
బెంగళూరు ; కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో ఈ నెల 23న జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. మరో సీటును బిజెపి మిత్రపక్షం జెడిఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. 75 సీట్లున్న విధానమండలి లో కాంగ్రెస్ కు ప్రస్తుతం 38 మంది సభ్యులుండగా, బిజెపికి 24, జెడిఎస్ కు ఆరు సీట్లున్నాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఐదుసీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం నామినేట్ చేయాల్సి ఉంటుంది. వీటి నామినేట్ తో కాంగ్రెస్ మెజారిటీకి ఢోకా ఏమీ ఉండకపోవచ్చు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను నిరాశ పర్చగా, బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. కాంగ్రెస్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని, వారివి మాటలే తప్ప చేతలుండయని తేలిపోయిందని బిజెపి నేత అశోక్ గౌడ విమర్శించారు.
బిజెపి ఈశాన్య టీచర్స్ నియోజకవర్గంలో, ఆగ్నేయ టీచర్స్ నియోజకవర్గంలోను, వెస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో విజయం సాధించగా, బెంగళూరు టీచర్స్ నియోజకవర్గం నుండి జెడిఎస్ గెలిచింది. నార్త్ ఈస్ట్ టీచర్స్ నియోజకవర్గం పరిధిలోనే ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత గ్రామం కలబుర్గి ఉండడం గమనార్హం. ఇక్కడి నుండి బిజెపి అభ్యర్థి శశీల్ జి.నమోషి ఐదవసారి గెలిచారు.
