Articles & Opinion

    AMITH MAJITHIA BUILDS 124 HOUSES.. FOR FLOOD VICTIMS

     సాయానికే సరికొత్త నిర్వచనం.!

  • – అపర కుబేరులకు ఆదర్శం !
  • – అమిత్ మార్గం …అనితర సాధ్యమా?

గౌహతి ; వరదలు, భూకంపాలు,తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడి సర్వం కోల్సోయిన వారికి అనేక మంది సాయం చేస్తుండడం మనం చూస్తుంటాం. అలాగే కొన్ని స్వచ్చంద సంస్థలు మరో అడుగు ముందుకువేసి మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడడం మనకు తెలిసిందే. ఇక ప్రభుత్వ శాఖల గురించి చెప్పనవసరంలేదు. ఆర్ అండ్ ఆర్ పేర ఒక విభాగాన్నే నిర్వహిస్తుంటాయి. కాని చివరికి చూస్తే  ఆ శాఖ ద్వారా బాధితులకు అందేది అరకొర సాయమే. అది కూడా కాళ్లరిగేలా తిరిగితేనే.

   మనకు ఎప్పుడూ పనికిరానివి, ఎన్నడో మనం పారేద్దామనుకున్నవి, చిరిగిన చొక్కాలు, విరిగిన కుర్చీలు, అరిగిన చెప్పులు ఈ బాధితులకు పడేయడం కొందరికి అలవాటు, ధనరూపేణ చేయాల్సివస్తే పదో పరకో ఇవ్వడం ఇంకొందరి నైజం. సహాయం నిజమైన బాధితులకు చేరుతుందో లేదో అనే సందేహంతో అసలు ఆ మాటే ఎత్తని వారు మరికొందరు.

      కాని ఒకే ఒక్కడు ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. సాయం అంటూ చేస్తే ఎలా చేయాలో, ఏది చేయాలో, ఎంత సమగ్రంగా, మరెంత స్వచ్చంగా చేయాలో చేసి చూపించబోతున్నాడు. ఆయన తలపెట్టిన సహాయం అనేక  స్వచ్ఛంద సంస్థలకు, అపరకుబేరులకు, దానకర్ణులకు కేస్ స్టడీలా ఉండబోతున్నది. అతడే అమిత్ మజీతియా.2018 నుండే తన స్వచ్ఛంద సంస్థ సిబిటిఎఫ్ ద్వారా సొంత డబ్బుతో ఎన్నో సేవాకార్యకలాపాలు నిర్వహిస్తున్న మజీతియా ఈసారి మరింత విలక్షణంగా బాధితులకు సాయం చేస్తున్నాడు.

    NEW TREND IN RELIEF WORKS

     అస్సాంలోని శివసాగర్ జిల్లా సొనారీ తాలూకా ప్రజాబస్తీ గ్రామంలో ఐదోవార్డును తన సహాయానికి క్షేత్రంగా ఎంచుకున్నాడు. అది జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో నాగాలాండ్ సరిహద్దులో ఉంటుంది. అక్కడ 124 కుటుంబాల ఇళ్లు వరదల్లో పూర్తిగా  కొట్టుకుపోయాయి, జనం కట్టుబట్టలతో మిగిలారు. దీంతో అక్కడ సహాయపునారావాస పనులు మొదలు పెట్టాడు అమిత్. తన మిత్రుల సాయంతో కోటి 66 లక్షలు జమ చేశాడు. వాటిని బాధితులకు నేరుగా పంచిపెట్టి చేతులు దులుపుకొని,  పత్రికల్లో, టివిల్లో చాటుకోకుండా ఆ 124  కుటుంబాలకు భవిష్యత్తులో వరదలు ముంచెత్తినా దెబ్బతినకుండా పటిష్టంగా ఇండ్లు పునర్నిర్మించి ఇస్తున్నాడు. గోడలు పైకప్పులే కాకుండా ఇంట్లో అవసరమయ్యే వస్తువులన్నీ సమకూర్చుతున్నాడు. అంటే గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్, వంటసామాగ్రి, డైనింగ్ టేబుల్, కుర్చీలు, మంచాలు, వాటిమీదికి పరుపులు, పక్కబట్టలు, ఆ కుటుంబాల్లోని విద్యార్థినీ విద్యార్థులకు  సైకిళ్లు, పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నాడు. ఇళ్ళకు కరెంట్ సదుపాయంతోపాటు, ఎల్ఇడి బల్బులు, ఫ్యాన్లు, మంచినీటి ప్యూరిఫైర్లు అందజేయడమేగాక, బాత్రూమ్ లు,వాష్ రూమ్ లు బోర్ బావులు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. పెద్దలకు సొంతగా పనిచేసుకునేందుకు పరికరాలు వగైరా సమకూర్చాడు. అయితే ఇవన్నీ పూర్తి చేయడానికి కేవలం 90 రోజుల గడువు పెట్టుకున్నాడు. వరదలతో మొత్తం ఊడ్చుకుపోయినా, అసలేం జరగనట్టు సాయం అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేలా వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. 

  ఎవరీ మజీతియా..?

 చదివింది 9వ తరగతే,  కాని ప్రస్తుతం రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. గుజరాత్ లోని కచ్ జిల్లా ఆదిపూర్ లో 1979లో జన్మించిన అమిత్ తన 13వ ఏట వ్యాపారం ప్రారంభించాడు. తాషన్ క్లబ్ , తాషన్ బాలీ స్టూడియో పేర్లతో సంస్థలను స్థాపించి మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో రాణించాడు. సిబిటిఎఫ్ మైట్యూబ్ డాట్ కామ్ అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ ఏర్పాటు చేశాడు. క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. క్రికెట్ ఆటను, ఆటగాళ్ల తీరును విశ్లేషించడంలో అద్భుతమైన నైపుణ్యం ఆయన సొంతం. క్రికెట్ అనలిస్ట్ గా ప్రపంచంలోనే ఆయనకు పేరుంది. క్రికెట్ బెట్టింగ్ లకు సూచనలిస్తారని ఆయనపై  ఆరోపణలున్నాయి. గతంలో అస్సాం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 51 లక్షలు విరాళంగా ఇచ్చి దానికి రశీదు అందలేదని అప్పటి సిఎం హిమంత విశ్వశర్మకే ఫిర్యాదు చేసి వార్తల్లోకెక్కారు. ఆయనకు ఇన్ స్టా గ్రామ్ లో 3.10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

 సాయం అంటే ఫోటోలకు ఫోజులివ్వడం, అరకొర విదిలించడం, వారి పేరు చెప్పి వసూలు చేసిందాంట్లో కొంత స్వాహా చేయడం, గోరంత చేసి కొండంత ప్రచారం చేయించుకోవడం, బాధితులను కేవలం ఓటర్లుగా చూడడం, తమ పార్టీ వారో, కులం వారో, మతం వారో అయితేనే ఆపన్న హస్తం అందించడం చాలా చోట్ల జరిగేదే. కాని సేవను నిష్కల్మషంగా చేయడమేగాక, వ్యాపారంలో వచ్చే లాభాలను  మానవసేవకు వెచ్చించాలని బలంగా నమ్మి ఆచరిస్తున్నందుకు హేట్సాఫ్ టూ.. అమిత్ మజీతియా.

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating