నిత్యారామన్ స్టోరీ పెద్దదే !
-లాస్ ఏంజిలిస్ మేయర్ విజయగాథ
– భర్త వాలి చంద్రశేఖరన్ స్క్రిప్ట్ రైటర్
అమెరికాలోని ప్రధాన నగరమైన లాస్ ఏంజిలిస్ మేయర్ గా డెమోక్రాట్ పార్టీ నుండి గెలిచిన నిత్యారామన్ సొంత ఊరు కేరళలోని త్రిసూర్, 1981లో జన్మించిన ఆమె తిరువనంతపురంలో చదువుకున్నారు. ఆమె తల్లి సుధ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో, తండ్రి కెల్ట్రాన్ లో పనిచేసేవారు. ఆరేళ్ల వయసులో వారి కుటుంబం అమెరికా వెళ్ళింది.
రాజకీయాల్లో ప్రవేశించిన నిత్య ప్రస్తుత మేయర్ కరేన్ బాస్ ను ఓడించారు ఆమెకు 52.70 శాతం ఓట్లు రాగా, మేయర్ బాస్ కు 47.30 శాతం ఓట్లు వచ్చాయి. తొలి దక్షిణాసియా వాసిగా, ప్రవాస భారతీయురాలిగా నిత్య చరిత్ర సృష్టించారు.
1999లో నిత్యకు హార్వర్డ్ యూనివర్సిటీలో వాలి చంద్రశేఖరన్ పరిచయమయ్యారు. అక్కడే చదువుతున్న చంద్రశేఖరన్ హార్వర్డ్ లాంపూన్ అనే హాస్యపత్రిక బాధ్యతలు చూసేవారు. వారిద్దరికీ 2010లో పెళ్లయింది. చంద్రశేఖరన్ మంచి రచయిత, అనేక టివి షోలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. కొన్ని కామెడీ షోలను నిర్మించారు. మాడరన్ ఫ్యామిలీ, 30 రాక్స్, ద ఫోర్ సీజన్స్ షోలకు ఆయనే రైటర్. ది రెడిక్యులస్ రేస్-26000 మైల్స్ , టూ గైడ్స్ వన్ గ్లోబ్ వంటి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఐదుసార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యారు.
కాగా, నిత్యారామన్ 2003లోనే ఢిల్లీకి వచ్చి కొంతకాలంపాటు మురికివాడల ప్రజల సమస్యలపై అధ్యయనం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం ఇళ్లు కోల్పోయిన పేదల ఇక్కట్లను దగ్గరుండి చూశారు. అనంతరం చెన్నయికి వెళ్లి ‘ ట్రాన్స్ ఫరెంట్ చెన్నయి ’ పేరుతో ఒక సంస్థను స్థాపించి నిరుపేదల కడగండ్లను ఎత్తిచూపారు. 2013లో అమెరికా లోని ఎంఐటి నుండి అర్బన్ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం లాస్ ఏంజిలిస్ లో ఇళ్ల ధరల పెరుగుదల , ఇళ్లులేనివారి సమస్యలపై అధ్యయనం చేశారు. ‘ షెలా నైబర్ హుడ్ హోమ్ లెస్ కోలియేషన్’ అనే సంస్థ సహవ్యవస్థాపకురాలిగా పనిచేశారు. లాస్ ఏంజిలిస్ లో మునిసిపల్ సేవలు చాలా దారుణంగా ఉండడం, మేయర్ గా కరేన్ బాస్ అసమర్థత వల్ల ప్రజలకు నిత్యపై విశ్వాసం పెరిగేలా చేసింది. ఆమె మేయర్ గా విజయం సాధించడం పట్ల కేంద్రమాజీ మంత్రి, ఐరాసలో భారత మాజీ రాయబారి శశిధరూర్ ఆనందరం వ్యక్తం చేశారు. అమెరికాలోని రెండు ప్రధాన నగరాలకు డెమోక్రాట్లే ఎన్నికవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది న్యూయార్క్ 112వ మేయర్ గా జోహ్రాన్ మందానీ ఎన్నికైన సంగతి తెలిసిందే.

Leave a Reply