అంజలి వివాహవేదిక మార్చుతా ; షర్మిల ప్రకటన
హైదరాబాద్ ; ఎపిసిసి అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నుండి మార్చనున్నట్లు ఎక్స్ ఖాతాలో తెలిపారు. నవంబర్ 25న అంజలి వివాహాన్ని బెంగళూరులోని యలహంకలో నిర్వహించాలని షర్మిల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వైఎస్ఆర్ పి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆమె సోదరుడైన వై.ఎస్. జగన్ అభ్యంతరం తెలిపారు. పెళ్లి సందర్భంగా అనేకమంది వస్తారని, భద్రతా సమస్యలు ఎదురవుతాయని, కావాలంటే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నిర్వహించుకోవాలని సూచించారు. అయితే ఈ విషయంలో షర్మిల ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియరానప్పటికీ బెంగళూరులోని యలహంక ప్యాలస్ లో మాత్రం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
కుటుంబ ఆస్తుల పంపకాల్లో భాగంగా బెంగళూరు ఆస్తి తన వాటాకే వచ్చిందని, దేవుడి సాక్షిగా యలహంక ప్యాలెస్ తనకు, తన పిల్లలకే చెందుతుందని షర్మిల ప్రకటించారు. తనది కాని దాని కోసం పాకులాడే , ఆశించే నీచత్వం తనకు లేదని ఆమె వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రస్తుతం పెళ్లి వేరేచోటకు మార్చుతున్నట్టు ఆమె వివరించారు. డిసెంబర్ ఐదున రిసెప్షన్ హైదరాబాద్ లో ఉంటుందని గతంలో ప్రకటించారు. మరి అది ఎక్కడ జరుగుతుందో ఇంకా తెలియరాలేదు. కాగా, తన పెళ్లి యలహంక ప్యాలస్ లో జరుపాలని తన కుమార్తె అంజలి కోరిందని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డ పెళ్లి తమ ఇంటనే జరుపుకోవాలని భావిస్తారని షర్మిల అన్నారు.
ఇదిలా ఉండగా, జగన్, షర్మిల వివాదాల్లో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తలదూర్చి జగన్ ను కంసమామగా సంబోధించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
