- అనుప్రియా నాగర్ సినీ కహానీ
ముంబయి ; ఆమె వయసు 21 సంవత్సరాలు, సినిమా పరిజ్ఞానం సున్నా..పెట్టుబడి పెట్టింది అక్షరాలా 55 లక్షలు ..వచ్చిన ఆదాయం ఎంత లేదన్నా వందకోట్లు. ఇదేదో సినిమా కథ కాదు..సినిమా తీసినవారి కథ. ఆ సినిమాయే ‘హనుమాన్ అన్శ్’. ఈ సినిమా తీయడానికి కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు మాత్రమే ఖర్చయింది. అది కూడా ముగ్గురు కలిస్తేనే. ఆ ముగ్గురిలో ఒకరే అనుప్రియా నాగర్. పుట్టింది ముంబయిలో చదివింది ఎకనామిక్స్ డిగ్రీ.. బ్రిటన్ లో. చదువు పూర్తయ్యాక జ్యూరిచ్ లో ఆమెకు మంచి ఉద్యోగం లభించింది. అయితే అటు వెళ్లకుండా సినిమా నిర్మాణంలో అదికూడా ఓ సాధువు (నీమ్ కరోలీ బాబా) జీవితకథ ఆదారంగా తీస్తున్న సినిమాకు ధైర్యంగా పెట్టుబడి పెట్టింది. ఆమె వద్ద కోట్ల రూపాయలు లేవు. తాను చదుకుంటున్నపుడు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసినపుడు దాచుకున్న మొత్తం డబ్బంతా 55 లక్షల వరకు ఉంటే వెనుకా ముందు ఆలోచించకుండా పెట్టుబడిగా పెట్టింది. సినిమా నిర్మాణంలో కొమ్ములు తిరిగిన మహామహులే ఇలాంటి సందర్భాల్లో వెనుకాడుతారు. అంతేకాక అది ఓ ఆధ్యాత్మిక సినిమాకు పెట్టుబడి పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు. చాలామంది కథ విని నిర్మాణానికి సాయం చేయడానికి చేతులెత్తేశారు. కొందరు పూర్తయ్యాక విడుదల కోసం సహకరించడానికి కూడా నిరాకరించారు. మరికొందరు ఇదేం ఆడుతుందని పెదవి విరిచారు. అయినా అందరి అంచనాలు పటాపంచలు చేసి ఇప్పటివరకు ఆ సినిమా 380 కోట్లకు పైగా వసూలు చేసింది. ముగ్గురు నిర్మాతల్లో అనుప్రియ వాటా కింద ఎంత లేదన్నా వందకోట్లు వస్తాయి. హనుమాన్ అన్శ్ సక్సెస్ అయ్యాక చాలామంది దర్శకుడు విపుల్ చతుర్వేదీని, ఈ ముగ్గురు నిర్మాతలను కలసి అభినందనలు తెలుపుతున్నారు. తాము అప్పట్లో పెట్టుబడి పెట్టనందుకు చింతిస్తున్నామని అంటున్నారు.
