Articles & Opinion

BEWARE OF DIWALI  SWEETS

పాడైన మిఠాయిలు కొత్తప్యాక్ లో

  • మహారాష్ట్రలో ఎఫ్ డిఎ దాడులు

ముంబయి ; దీపావళి పండుగ వచ్చిందంటే అటు టపాసులు, ఇటు మిఠాయిలు బాగా అమ్ముడవుతాయి. అయితే ఆ టపాకాయలు నాణ్యమైనవిగా ఉంటేనే పేలుతాయి. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మిఠాయిలు కూడా శ్రేష్టమైనవైతేనే మేలు. కల్తీవి, పాతవైతే ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లినట్టే. ఈ సంగతి మనదేశంలో బాగా తెలిసిన వ్యక్తి తుకారాం ముండే. ఆయన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి దేశమంతా ఆయన గురించి, ఆయన చేస్తున్న దాడుల గురించి, మూయిస్తున్న రెస్టారెంట్ల గురించి చర్చించుకుంటోంది. తాజాగా ఆయన దీపావళి పండుగ వేళ వ్యాపారులు ఆడే నాటకాలకు, మోసాలకు చెక్ పెట్టారు. పాడైపోయిన మిఠాయిలను దుకాణదారులు విక్రయించకుండా పారవేయాలి. కాని వాటిపై రంగులు పూసి కొత్తగా ప్యాక్ చేసి వినియోగదారులకు అంటగట్టేందుకు ప్లాన్ వేసిన మిఠాయివాలాల వ్యవహారాలను తుకారామ్ ముండే ముందుగానే గ్రహించి అటువంటి మిఠాయిల గోదాములపై దాడులు చేసి వారి పన్నాగాన్ని తిప్పికొట్టారు.

భివాండీ, అంబర్ నాథ్, పడ్గా లలో ఉన్న మిఠాయిల గోదాముల్లో దాచివుంచిన కోట్ల రూపాయల విలువచేసే మిఠాయిలను సీజ్ చేశారు. 34 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు నెలన్నర నుండి ఈ వ్యవహారాలపై  కన్నేసిన ఎఫ్ డి ఎ సిబ్బంది ఆయా ప్రదేశాలపై పది మార్లు దాడులు చేశారు. పాడైపోయిన స్వీట్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లకు మళ్లీ చేరకుండా అడ్డుకోగలిగారు. ఈ షాప్ ల ఓనర్లు , గోదాముల యజామానులు పాడైపోయిన స్వీట్లను పారేసినట్టు పుస్తకాల్లో రాసి వాటిని రహస్యంగా దాచి పండుగ వేళ మళ్లీ రంగులు పూసి కొత్తగా ప్యాక్ చేసి విక్రయించడానికి సిద్దమైనట్టు ఈ దాడుల్లో తేలింది. స్వీట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎఫ్ డి ఎ కమీషనర్ తుకారామ్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పనులకు పాల్పడరాదని  గోదాముల, కోల్డ్ స్టోరేజీల యాజమానులను ఆయన హెచ్చరించారు.

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate