Articles & Opinion

IAS acquired 40 RESORTS

ఆ ఐఎఎస్ కు 20 విల్లాలు, 20 రిసార్టులు

  • శిఖర్ అగర్వాల్ భాగోతం

 జైపూర్ ; రాజస్థాన్ లో లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శిఖర్ అగర్వాల్  20 విల్లాలు, మరో 20 కాటేజీలు సంపాదించి వార్తల్లో కెక్కాడు. ఇవన్నీ రెండున్నరేళ్ల వ్యవధిలోనే రిజిస్టర్ చేసుకున్నాడు. దీంతో ఆయనకు తదుపరి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టింది. 1993 బ్యాచ్ అధికారి అయిన శిఖర్ అగర్వాల్ తన సర్వీసులో అనేక కీలకమైన శాఖల్లో పనిచేశాడు. రాజస్థాన్ పెట్టుబడుల ప్రమోషన్ బ్యూరోలో, భీవాడీ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ అథారిటీ (బీడా)లో,  రాజస్థాన్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి,పెట్టుబడుల సంస్థ (ఆర్ఐఐసి) ఛైర్మన్ గా, రాష్ట్ర లఘుపరిశ్రమల సంస్థ సిఎండిగా పనిచేశారు. అంతేకాక విదేశాల్లో ఉన్న రాజస్థాన్ పౌరుల వ్యవహారాల శాఖను, ఢిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్ ను  కూడా అదనంగా అగర్వాల్ పర్యవేక్షించాడు.    

  ‘అనంత్’ పేరుతో విల్లాలు,రిసార్టులు నిర్వహిస్తున్న ‘‘ గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ కంపెనీ నుండి శిఖర్ అగర్వాల్ ఆయన కుటుంబ సభ్యులు ఈ 4‌0ఆస్తులను కొనుగోలు చేశారు. ఉదయపూర్ జిల్లాలోని భుజ్ దా లో 20 కాటేజీలు, ఆల్వార్ జిల్లా అజబ్ గఢ్ లో 20 విల్లాలను కొన్నారు. వీటన్నిటిని రూ.6.6కోట్లకు కొన్నట్టు తెలిపారు.  కాటీజీలు 2023 సెప్టెంబర్ లో, విల్లాలు 2026 మార్చి నెలలో రిజిస్టర్ చేసుకున్నారు. మళ్ళీ వాటిని ఆ కంపెనీకే లీజుకు ఇచ్చారు. లీజ్ మొత్తం ఏడాదికి 1.80 లక్షలుగా లీజ్ అగ్రిమెంట్ లో  పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఆయన సివిల్ సర్వీసు నిబంధనలకు లోబడి ఉన్నాయా, వాటిని తన ఆస్తుల జాబితాలో పేర్కొన్నారా అనే సంగతి తెలియరాలేదు.

 కాగా, శిఖర్ అగర్వాల్ శ్రీమతి ప్రశాఖా మాథుర్ ఐపిఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు.  ఇదిలా ఉండగా, ఆయనపై ,ఈ ఆస్తులపై ప్రాథమిక విచారణకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. కేవలం తదుపరి నియామక ఉత్తర్వులను పెండింగ్ లో పెట్టింది. ఎప్పుడు విచారణకు ఆదేశిస్తారో, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారో తెలియరాలేదు.

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating