పరువు నష్టం కేసులో రాహుల్ కు క్లీన్ చిట్
- సుల్తాన్ పూర్ కోర్టు తీర్పు
సుల్తాన్ పూర్ ; కేంద్రహోంమంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యల కేసులో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి క్లీన్ చిట్ లభించింది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యుపి లోని సుల్తాన్ పూర్ లో ఒక కేసు దాఖలైంది. అప్పటి నుండి అది విచారణ జరుగుతోంది. 2023 లో రాహుల్ కు సమన్లు అందాయి. ఈనెల 13న తుది తీర్పు వెల్లడించాల్సి ఉండగా సోమవారం (అక్టోబర్ 26) నాటికి వాయిదా పడింది. సుల్తాన్ పూర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా ఐపిసి సెక్షన్ 499, 500 ల కింద రాహుల్ పై ఫిర్యాదు చేశారు. సుల్తాన్ పూర్ లోని ఎంపి, ఎంఎల్ ఎ ల ప్రత్యేక కోర్టు దీన్ని విచారించి కొట్టివేసింది. రాహుల్ ప్రసంగంలో పరువునష్టం కలిగించే అంశాలేవీ లేవని అందుకని ఆయనను నిరపరాధిగా ప్రకటిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
ఈ కేసులో రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్ ఎస్ చీమా, తరణం చీమా, ఆకాశ్, ప్రసన్న, కాశీ శుక్లాలు వాదించారు. కాగా రాహుల్ నిరపరాధిగా బయటపడడం పట్ల యుపి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా హర్షం వ్యక్తం చేశారు.