ఖర్గే వ్యాఖ్యలపై రగడ
‘ మోడీ కా బాప్ భీ జాయేగా’ పై విమర్శలు
న్యూఢిల్లీ, పాట్నా ; ప్రధాని నరేంద్రమోడీ పై ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద దుమారం చెలరేగింది. ఎస్ఐఆర్ అక్రమాలు, సిఇసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం కాంగ్రెస్ మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసింది. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఖర్గే మాట్లాడుతుండగా, సభలో నుండి ఒకడు లేచి ‘‘ మోడీ నహీ జాయేగా …’’ అని అరవడంతో దానికి సమాధానంగా ఖర్గే ‘‘ మోడీ జాయేగా..మోడీ కా బాప్ భీ జాయేగా..’’ అని యథాలాపంగా అన్నారు.
ఈలోపు కాంగ్రెస్ కార్యకర్తలు అలా అరిచిన సంతోష్ కుమార్ అనే వ్యక్తిని సభనుండి బయటికి గెంటేశారు. కాగా మల్లికార్జున ఖర్గే ప్రధానిని అవమానించారని, ఆయన తండ్రిని కూడా అవమానించారని, దేశాన్ని అవమానించారని బిజెపి నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే తాను సామెతను మాత్రమే ఉదహరించానని, మోడీని వ్యక్తిగతంగా దూషించలేదు. ఆయన తండ్రిని ఏమీ అనలేదని మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ నాయకులకు మోడీని వ్యక్తిగతంగా దూషించడం అలవాటైపోయిందని బిజెపి నేతలు అంటున్నారు. గతంలో మోడీ మాతృమూర్తిని కూడా ఇలాగే అవమానించారని వారు గుర్తు చేశారు. ఇతర సమస్యలు ఏమీ లేకపోవడంతో కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వారు ఆరోపించారు.. కాంగ్రెస్ నేతలు మర్యాదలను అతిక్రమిస్తున్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే వీటిని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న‘ సర్’ ఆందోళనలను పక్కదారి పట్టించడానికే బిజెపి నేతలు దీన్ని వివాదాస్పదం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, ఖర్గేపై పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.