అద్దెకొంపలో 500 నోట్ల ముద్రణ !
నాగపూర్ ; చాలా కాలంగా ఇంటి అద్దె కట్టకపోవడంతో గది తాళాలు పగులగొట్టిన ఇంటి యజమానికి కళ్లు బైర్లుగమ్మే దృశ్యం కనిపించింది లోపల. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి చూస్తే 37 లక్షల విలువ చేసే 500 రూపాయల నోట్లు ముద్రణ అయి రెడీగా ఉన్నాయి. మరో 48 లక్షల విలువ చేసే నోట్లు సగంసగం ప్రింట్ అయి వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు పుష్పక్ కృష్ణ భండార్కర్ కోసం గాలిస్తున్నారు. నాగపూర్ నగరంలోని త్రిమూర్తి నగర్ కు చెందిన భండార్కర్ ఖార్బీ ఏరియాలో ఏడాదిన్నర కిందట ఓ గది అద్దెకు తీసుకున్నాడు. దొంగనోట్ల ప్రింట్ చేసి చలామణి చేస్తున్నట్టు తేలింది. అయితే గత జనవరి నుండి గదికి అద్దె చెల్లించడం లేదు. అడిగినప్పుడల్లా వాయిదా వేస్తున్నాడు. అంతేకాక ఇంటి యజమాని రమేశ్ ను కత్తితో చంపుతానని బెదిరించాడు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ సంగతి తెలిసిన భండార్కర్ గదికి తాళం వేసి చెక్కేసాడు. దీంతో చేసేదేమీ లేక ఇంటి యజమాని గది తాళం పగులగొడితే లోపల 500 నోట్ల కట్టలు, వాటిని ప్రింట్ చేసేందుకు వాడే సామాగ్రి, కౌంటింగ్ మెషీన్ తదితర వస్తువులు పెద్ద మొత్తంలో కనిపించాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన భండార్కర్ ముంబయిలో ఉన్నట్టు కనుగొన్న పోలీసులు అక్కడికి ఒక బృందాన్ని పంపించారు. ఈ నోట్లు ఎంతవరకు చలామణి అయ్యాయో ఆరా తీస్తున్నారు.
