Andhra Pradesh

“Free PR for CJP? Police Arrests Put a Rival Party on the National Map” సిజెపికి ఫ్రీ పబ్లిసిటీ ఎందుకిస్తున్నట్టు ?

బిజెపిపై అన్నామలై ఫైర్  

  • నిరసన తెలపడం దేశద్రోహమా
  • ప్రతిపక్ష ఓట్లలో చీలిక కోసమేనా..

చెన్నయ్ ; కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ కాక్రోచ్ జనతా పార్టీని వ్యతిరేకిస్తోందా…లేక సమర్థిస్తోందా చెప్పాలని తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై నిలదీశారు. సిజెపికి భారతీయ జనతాపార్టీ ఉచితంగా పబ్లిసిటీ కల్పించడం చూస్తుంటే ఈ సందేహం వస్తోందన్నారు. సిజెపిని అది చేస్తున్న ఆందోళనలను అనవసరంగా కేంద్రప్రభుత్వం వ్యతిరేకించడం ఏమీ బాగాలేదని ఆయన విమర్శించారు. జంతర్ మంతర్ ను నిరసన దీక్షల ప్రదేశం కాని స్థలంగా ప్రకటించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిజెపి ఆందోళనలు పోలీసులచే అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఆందోళనలు, నిరసనలు చేయడం దేశద్రోహమని, ఆందోళనకారులకు విదేశీ నిధులు అందుతున్నాయని ముద్రవేయడం దారుణమని అన్నామలై విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజ్యాంగబద్దమైనవేనని ఆయన అన్నారు.

 2011 లో రాంలీలా మైదానంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఆందోళనలను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే అడ్డుకోవాలని చూస్తే అప్పటి గుజరాత్ సిఎం. ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీ తప్పుపట్టారని అన్నామలై గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు సమంజసమైనపుడు ఇప్పటివి ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు. ఎంతసేపు విదేశీ నిధులు అందుతున్నాయని ఆరోపించడం కాదని, చేతనైతే వాటిని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. విదేశీ నిధుల వ్వవహారాలను పర్యవేక్షించే అధికారం కేంద్రహోం శాఖ కే ఉందని ఆయన గుర్తు చేశారు. విచారణ జరిపి నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు జరపడం తప్పుకాదన్నారు. సిజెపి నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం, బెయిల్ రాకుండా చూడడం, బాండ్లు సమర్పిస్తే అవి చెల్లనివని తిరస్కరించడం అంతా వేధింపుల్లో భాగమని ఆయన దుయ్యబట్టారు. ఇలా చేయడం వల్ల సిజెపికి ఇంకా ప్రజల మద్దతు పెరుగుతుందని, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఆయన తెలిపారు. రాంలీలా మైదాన్ లో బిజెపి ఎమ్మెల్యే అశోక్ గోయల్ కాక్రోచ్ ల దిష్టిబొమ్మను దహనం చేయడం వల్ల సిజెపికే లాభం కలుగుతుందన్నారు. ప్రతిపక్షాల ఓట్లలో చీలిక తేవడం కోసమే బిజెపి ఇదంతా చేస్తోందనే అనుమానం అన్నామలై వ్యక్తం చేశారు. తనను బిజెపి బి టీమ్ గా కొందరు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమిళనాడుకు దురంధర్ అంటున్నారని ఆయన అన్నారు. గత జూన్ లో బిజెపికి గుడ్ బై కొట్టిన అన్నామలై కేంద్రప్రభుత్వ వైఖరిపై ఇలా విరుచుకుపడడం ఇదే మొదటిసారి.  

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate