Andhra Pradesh

“Is Bollywood Retreating into its old shadows?” తిరిగి పాత పడగ నీడలోకి బాలీవుడ్?

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు యాక్షన్ హీరో  టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఉదంతం బాలీవుడ్ ని మామూలుగా వణికించడం లేదు- మళ్ళీ 1990 లనాటి మాఫియా పడగ నీడలోకి బాలీవుడ్ తిరిగి వెళ్తోందా అన్న ప్రశ్నతో కలవరపడుతోంది. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి  జుహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆట ముగించుకుని, ఒక పుట్టినరోజు వేడుకకి  హాజరై, ఇంటికి వెళ్ళడానికి టైగర్ ష్రాఫ్ కారు ఎక్కుతూంటే గన్స్ పట్టుకున్న ఇద్దరు షూటర్స్  కాల్పులు జరిపారు. టైగర్  కారుని అడ్డగించి, అద్దంలోంచి క్లోజ్ రేంజిలో ఏడు బుల్లెట్లు కురిపించారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన నిపుణుడైన టైగర్, బుల్లెట్లు తన పక్క నుంచి దూసుకెళ్తూంటే తక్షణం కిందికి వంగి వంగాడు. ఆ బుల్లెట్లు డ్రైవర్ ఫిర్దౌస్ చేతుల్ని  రాసుకుంటూ వెళ్ళి, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఛాతీకి తగిలాయి. టైగర్ వేడిని ఎగజిమ్ముతున్న గన్ పౌడర్ తాలూకు చిన్న చిన్న కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఒక పెద్ద రక్తపాతంగా మారాల్సిన ప్రమాదం నుంచి కారులో వున్న ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు.

కాల్పులు జరిపిన నిమిషాల్లోనే, షూటర్స్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఈ దాడికి తాము  బాధ్యులమని చెప్పుకుంటూ పోస్ట్ చేశారు. వీళ్ళు బరితెగించి బాలీవుడ్ మొత్తానికీ హెచ్చరిక జారీ చేయడంతో పాటు, ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట వర్గానికి – తమ ప్రధాన లక్ష్యంగా వున్న సల్మాన్ ఖాన్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ ఇదే గతి పడుతుందని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టబోమని  ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌ని, అతడి  కుటుంబాన్నీ పూర్తిగా నాశనం చేస్తామని ధైర్యంగా బెదిరిస్తున్న ఆ గజిబిజి రికార్డింగ్‌ వైరల్ అయింది. సల్మాన్ ఇంట్లో ఒక్క కుక్కని కూడా బ్రతికి వుండనివ్వమని ప్రగల్భాలు పలికారు.

అయితే టైగర్ ష్రాఫ్‌కి సల్మాన్ తో ఏ విధమైన సంబంధముంది? అతను సల్మాన్ తో కలిసి నటించలేదు. నటిస్తున్నట్టు కొత్త ప్రాజెక్టు కూడా  ఏదీ ప్రకటించలేదు. మరి టైగర్ ని ఎందుకు టార్గెట్ చేశారంటే, టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ తో కలిసి  బాంద్రా ఏరియాలో అత్యంత విజయవంతమైన జిమ్‌లైన ఎంఎంఏ మ్యాట్రిక్స్, ఎంఎంఏ  వెల్నెస్ లున్న ఫుడ్ స్క్వేర్ భవనం సల్మాన్ ఖాన్ దే.  దానికి  భారీ అద్దె చెల్లిస్తున్నారు. ఈ హంతకులు ఎవరో కాదు- రెండు దశాబ్దాలుగా సల్మాన్ మీద పగబట్టి వున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులే.

ఇది నిజంగా బిష్ణోయీలు సజీవంగా ఉంచుతున్న పాత కృష్ణజింక కథ అనుకోవాలా, లేక   అంతకంటే చాలా పెద్ద విషయమనుకోవాలా?  1998లో ఒక కృష్ణజింకని  చంపినందుకు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలన్న బిష్ణోయీల డిమాండ్ పాతదే. కానీ క్షమాపణ చెప్పాలంటే, సల్మాన్ ముందుగా ఆ హత్యని ఒప్పుకోవాలి. అతను ఒప్పుకోడు, లారెన్స్ వూరుకోడు.

సంవత్సరాలుగా సల్మాన్ మీద జరుగుతున్న దాడుల వెనుక సూత్రధారి అయిన లారెన్స్ బిష్ణోయ్‌, ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌ని టార్గెట్ చేశాడు. అతను  ఏమాత్రం జంకు లేకుండా, ప్రొఫెషనల్ కిల్లర్స్ బృందానికి నాయకత్వం వహిస్తూ, ఏ లోటూ లేకుండా గుజరాత్  జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇప్పుడు తర్వాతి లక్ష్యంగా ఎవరు మారతారోనన్న భయంతో బాలీవుడ్ తీవ్ర ఆందోళనతో, భీతితో స్తంభించిపోయింది. ఇటీవలి బెదిరింపుల్ని ఒక్కసారి చూస్తే చాలు: ఆమీర్ ఖాన్, రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ వంటి కొందరు. ఇంతకంటే పెద్ద ఆందోళన పర్చే దేమిటంటే: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు కేవలం లక్ష్య సాధన కోసమేనా? లేక బాలీవుడ్ స్వరూపాన్నే దాదాపుగా నాశనం చేసిన పాత, ప్రాణాంతక గ్యాంగ్ వార్స్ మళ్లీ ప్రారంభం కావడానికి సంకేతమా?

1990 లలో  భయంకర డి-గ్యాంగ్ ప్రమేయంతో జరిగిన క్రూర అధికార పోరాటాలు, బెదిరింపులు, బాలీవుడ్ ప్రముఖుల పగటిపూట హత్యల వైపూ తిరిగి వెళ్తోందా బాలీవుడ్? ఒకవేళ ఇదే నిజమైతే – ఈ దుష్ట కుట్రలో ఏ రాజకీయ పార్టీలు భాగస్వాములుగా వున్నాయి? ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు?

బలమైన రాజకీయ అండ లేకుండా, భయంకరమైన అండర్‌వరల్డ్ మనుగడ సాగించలేదు, వృద్ధి చెందలేదు. ఇక బాలీవుడ్ కి చెందిన ఎవరైనా సరే ఇలా భయపడుతూ బతకాలా? ఎవడైనా హంతకుడేమోనని నిరంతరం వెనక్కి తిరిగి చూసుకుంటూ, భయంతో వణికిపోతూ? ఇళ్ళ నుంచి బయటికీ  రావడానికి భయపడుతూ? సెట్స్ లో తీవ్ర భయాందోళనలకి  గురవుతూ?

గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కొత్తేమీ కాదు. బాలీవుడ్‌పై పట్టు సాధించడమే అండర్‌వరల్డ్ కి ఎల్లప్పుడూ అంతిమ లక్ష్యంగా వుంది. కొంత విరామం తర్వాత దుబాయ్ డాన్‌లు మళ్ళీ  రంగంలోకి దిగినట్టు కనిపిస్తున్నారు. ఇక బిష్ణోయీలు తమ ప్రత్యర్థులకి  అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు.

అ మధ్య సల్మాన్ మిత్రుడు బాబా సిద్ధిఖీపై దాడి చేసి చంపిన హంతకులు  ఇప్పటికీ ఎక్కడో పరారీలో వున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ ఈ తాజా దాడిపై కఠిన  ప్రకటనలు జారీ చేశారు. టైగర్ కారుమీద ఏడు రౌండ్లు కాల్పులు జరిపి, పారిపోయిన మోటార్‌బైక్ హంతకుల్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాన్నీ వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.

సోమవారం ఉదయానికల్లా పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారు.  మంగళవారం మరో నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితులైన కునాల్,  సుమిత్, రాధ, బబిత లను ఢిల్లీ, హర్యానాల్లో అరెస్టు చేశారు. వీరు కుట్రకి సహకరించారు.  దాడికి పాల్పడ్డ ముగ్గురూ రేహన్, హృతిక్, ఫూల్ సింగ్‌లుగా పోలీసులు ప్రకటించారు. నేపాల్‌కి  పారిపోవడానికి ప్రణాళిక వేస్తున్న ఈ నలుగురినీ రాజస్థాన్‌లోని కోటాలో అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని ముంబాయికి తరలించారు.

బిష్ణోయీలు బాలీవుడ్‌ మీద ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ మీద దాడి గురించి గొప్పలు చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్ వణికిపోతోంది. గెలాక్సీ అపార్ట్ మెంట్స్ లోని సల్మాన్ ఖాన్ ఇల్లు ఒక దుర్గంలా వుంది.  ష్రాఫ్ నివాసం కూడా అంతే. భయాందోళనలకి లోనైన బాలీవుడ్ తారలు బయట కనిపించకుండా మౌనం పాటిస్తున్నారు.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating