Articles & Opinion

 YOGI again in UP.. MANN in PUNJAB

పంజాబ్ కిరీటం మాన్ కే, యుపి పీఠం యోగి దే..

 2027 ఎన్నికల్లో గెలుపుపై సర్వే

చండీగఢ్,లక్నో; వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కు, పంజాబ్ లో భగవంత్ సింగ్ మాన్ కు ఓటర్లు మరోసారి పట్టం కట్టనున్నారు. గత నెల 13 నుండి అక్టోబర్ 14 వరకు స్కోర్ ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో పంజాబ్ లో భగవంత్ సింగ్ మాన్ నాయకత్వంలోని ఆప్ సర్కార్ కే విజయావకాశాలున్నట్టు తేలింది. 117 సీట్లున్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 69 నుండి 82 సీట్ల వరకు సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ కు 17నుండి 34 సీట్లు వస్తాయని, బిజెపికి 4-12 సీట్లు, శిరోమణి అకాలీదళ్ , వారిస్ పంజాబ్ దే పార్టీలకు చెరో 2 నుండి ఆరు సీట్ల దాకా గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.

  అయితే, 2022 ఎన్నికలతో పోల్చితే ఆప్ ఓట్లశాతం గణనీయంగా తగ్గనుంది. 42 శాతం నుండి అది 38 శాతానికి పడిపోతున్నప్పటికీ రాష్ట్రంలో అధికారం మాత్రమే ఆప్ కే దక్కుతుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 22 శాతం ఓట్లు సాధించగా, ఈసారి 24 శాతానికి పెరుగనుంది.బిజెపి ఓట్ల శాతం కూడా 6.6 శాతం నుండి 14 శాతానికి పెరుగనుంది. కాగా అకాలీదళ్ ఓట్ల శాతం 18.3శాతం నుండి 12.5 శాతానికి తగ్గిపోనుంది.

  రాష్ట్రంలో ఆప్ పాలన చాలా బాగుందని 43 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, 14 శాతం మంది బాగుందన్నారు. 22 శాతం మంది బాగోలేదనగా, 20 శాతం మంది ఫర్వాలేదన్నారు.

 ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 39.3 శాతంమంది భగవంత్ సింగ్ మాన్ కే ఓటేయగా, కాంగ్రెస్ నేత చరణ్ జీత్ సింగ్ చన్నీ కి 15 శాతం మంది, అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు 10.4 శాతం మందే మద్దతు పలికారు.

యోగి ఆదిత్యనాథ్ వైపే జనం మొగ్గు

 ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేసినా గెలిచేది మాత్రం యోగిఆదిత్యనాథ్ సారథ్యంలోని బిజెపి కూటమి అని తేలింది. గత నెల 17నుండి ఈ నెల రెండు వరకు రాష్ట్రంలోని 75 జిల్లాల్లో, ఏడు ప్రాంతాల్లో దాదాపు 30 వేలమందికి పైగా ఓటర్లను ప్రశ్నించి యుపి ప్రజల నాడిని నిర్ధారించారు. న్యూస్-18 ఈ మెగా సర్వే నిర్వహించింది. బిజెపి సారథ్యంలోని ఎన్ డిఎకు 60 శాతం పైగా ఓటర్లు మద్దతు పలుకుతుండగా, కాంగ్రెస్,ఎస్ పి కూటమికి 32 శాతం పైగా మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైపు ప్రజలు అధిక సంఖ్యలో మొగ్గు చూపారు. ఆయన వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతున్నామని వారంటున్నారు. ఆ తర్వాత స్థానం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల  కల్పనకు, పారిశ్రామికీకరణకు గట్టిగా కృషి చేస్తున్నందుకు యోగి సర్కార్ కు జనం జేజేలు పలుకుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండడం, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సవ్యంగా అందుతుండడం కూడా ప్రజల మన్ననలందుకుంటోంది. ఇక ముఖ్యమంత్రిగా యోగికే ఎక్కువ మార్కులు పడ్డాయి.

   2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లలో బిజెపికి సొంతగా 255 సీట్లు రాగా దాని మిత్రపక్షాలకు కలిపి 273 సీట్లు వచ్చాయి. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీకి 111 సీట్లు దాని మిత్రపక్షాలకు మరో 14 సీట్లు వచ్చాయి. దీంతో మూడోసారి ముచ్చటగా యుపి సిఎం గా యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టనున్నట్టు తెలుస్తోంది.  

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating