- PRAKASH RAJ
- నియంతృత్వానికి కాలం చెల్లింది ; ప్రకాశ్ రాజ్
తిరువనంతపురం ; శాంతియుతంగా జరుపుతున్న నిరసన ప్రదర్శనలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని ప్రముఖ నటుడు, సామాజిక ఉద్యమకారుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. తిరువనంతపురంలో జరిగిన యువజన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని , ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని తాము కోరుతుంటే, తమను అణచివేయడం చూస్తుంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు తేలుతున్నదని ఆయన అన్నారు. ఈ అణచివేతలతో ఉద్యమం ఆగబోదని, మరింత పుంజుకొని దేశమంతా వ్యాపిస్తుందన్నారు. నిరసన తెలిపే వారిలో గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ ల రక్తం ఉన్నదని గ్రహించాలని ఆయన అన్నారు.యువతరం తలపెట్టిన ఉద్యమంలో పాలుపంచుకునేందుకు రైతులు కూడా ముందుకు వస్తారని ఆయన తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పాటుపడుతున్న పోలీసులు, సైన్యం కూడా ఈ దేశపౌరులేనని , వారంతా త్వరలోనే అలసిపోక తప్పదన్నారు. తాము ఈ అణచివేతకు పాల్పడబోమని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లకు చెప్పేరోజు వస్తుందన్నారు. యువతరం అడిగే ప్రశ్నలకు జవాబులు లేకనే ప్రభుత్వం భయపడి ఈ అణచివేత కొనసాగిస్తున్నదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు త్వరలోనే తప్పు తెలుసుకుంటారని, నియంతృత్వానికి కాలం చెల్లుతుందని ఆయన అన్నారు.
