Opens in 2027
కనువిందు చేయనున్న భారత్ మ్యూజియం !
* 30 గ్యాలరీలతో వచ్చే ఏడాది ప్రారంభం
న్యూఢిల్లీ ; దేశరాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారత్ మ్యూజియంలో సాంస్కృతిక వారసత్వం కళ్ళకు కట్టినట్టు ఉంటుందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ తెలిపారు. కేంద్రప్రభుత్వ కార్యాలయాల సముదాయం నార్త్,సౌత్ బ్లాక్ లలో ఏర్పాటవుతున్న ఈ మ్యూజియంలో 30 గ్యాలరీలుంటాయన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత, భాగవత తదితర ఇతిహాసాల ప్రతులు,వాటి విశేషాలు, చారిత్రక కట్టడాల వివరాలు, అనేక ప్రాంతాల్లో విరాజిల్లిన భాషలు, వాటికి సంబంధించిన ప్రతులు, సాహిత్యం వాటి వికాస క్రమం చూపరులకు సులభంగా అర్థమయ్యేరీతిలో ప్రదర్శించబోతున్నట్టు ఆయన విలేకరులకు తెలిపారు. వచ్చే ఏడాది లో దీన్ని ప్రారంభించనున్నారు. దేశానికి చెందిన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, గణితం, శాస్త్రసాంకేతిక రంగాల ప్రగతి, విద్య, వైద్యం, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి శాస్త్రాల విశేషాలు, ఇతర కళారూపాలు, యుగయుగాలుగా వర్ధిల్లిన అనేక రంగాల సమాహారం ఈ మ్యూజియంలో ఉంటాయన్నారు. అందుకే దీని పేరును కూడా ‘‘ యుగే..యుగే భారత్ మ్యూజియం ’’ అని పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలలో సుమారు 20 లక్షలకు పైగా విశేషాలున్నాయని, ఈ ఢిల్లీ మ్యూజియంలో వాటిలో కనీసం 30 శాతం ఉంచబోతున్నట్టు వివేక్ తెలిపారు.
అనాదిగా విదేశాలతో భారతదేశం నెరపిన సంబందాలు, ఇచ్చిపుచ్చున్న విజ్ఞానసంపద కూడా ఇందులో నిక్షిప్తం చేయనున్నట్టు అగర్వాల్ వివరించారు. సందర్శకుల సమయాలకు అనువుగా ఏయే గ్యాలరీలను వీలయితే ఆయా గ్యాలరీలు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. సందర్శకుల కోసం లిఫ్ట్లులు, ఎస్కలేటర్లు, గ్లాస్ చాంబర్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటవున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కసారి దీన్ని సందర్శిస్తే యుగయుగాలుగా ‘ భారత్ ’ అంటే ఏమిటో, విశ్వంలో దాని స్థానం, వివిధ దేశాల నాగరికతలతో పోల్చితే మనస్థాయి ఏమిటో ఇట్టే అవగతమవుతుందన్నారు. భారతీయ నాగరికత తీరుతెన్నులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందని, దేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వం గురించి ఎంతోకొంత తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు.
