OPPOSITION Supports CJP
కన్నాట్ ప్లేస్ ప్రదర్శన భగ్నం
- వందలాదిమంది అరెస్ట్
- సిజెపికి ప్రతిపక్షాల మద్దతు
న్యూఢిల్లీ ; దేశరాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద సిజెపి ఆధ్వర్యంలో తలపెట్టిన జాతీయ జెండాల ఎగురవేతను పోలీసులు భగ్నం చేశారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను ఆయన నివాసం ఝండేవాలా దగ్గరే అరెస్ట్ చేయగా, ఎఐఎస్ఎ నాయకురాలు నేహా బోరాను జంతర్ మంతర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ అరెస్ట్ లపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. జాతీయ జెండాల ప్రదర్శనను అడ్డుకోవడమేంటని బెంగాల్ మాజీ సిఎం, మమతా బెనర్జీ , తమిళనాడు మాజీ సిఎం ఎంకె.స్టాలిన్, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను దుయ్యబట్టారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని వారు విమర్శించారు.
పాకిస్తాన్ లో ఎగురవేయాలా ?
భారత జాతీయ జెండాను ఈ దేశంలో కాకుండా ఇంకెక్కడ ఎగురవేయాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. జాతీయ జెండాతో సమస్య ఉన్నవాళ్లు పాకిస్తాన్ కు చెక్కేస్తే మంచిదన్నారు. సిజెపి అంటే బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ చాలా భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, కన్నాట్ ప్లేస్ వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఆ ఛాయలకే ఎవరూ రాకుండా చూశారు. కేంద్రబలగాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది అక్కడ మోహరించి ఆ దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా చేశారు. వచ్చినవారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ దిప్కేను, నేహా బోరాను ఢిల్లీ నగర శివార్లలోని పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఎందుకీ అసహనం ?
కాగా, అటు బిజెపి,ఇటు కేంద్ర ప్రభుత్వం నిరసనకారులంటే ఎందుకింత అసహనం ప్రదర్శిస్తున్నాయో రాజకీయ పరిశీలకులకు అంతుబట్టడం లేదు. నిన్నటిదాకా సందర్భం వస్తే చాలు ఎమర్జెన్సీని దుయ్యబట్టిన పార్టీ నేడు ఇలా అప్రకటిత ఎమర్జెన్సీ విధించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఎన్నో నీతులు వల్లె వేసిన పార్టీ అదే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుండడం ,శాంతియుత నిరసనలపై విపరీతమైన అసహనాన్ని చూపడం ఎందుకో అర్థం కావడం లేదు. సిజెపి కార్యకర్తలపై, ప్రతిపక్షాలపై అణచివేత పెంచుతూ, వారి గొంతులు నొక్కుతూ రోజురోజుకు నిరంకుశ పార్టీగా పేరుతెచ్చుకుంటుండడం బిజెపి అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మరో వైపు ఇలాంటి అణచివేతతో ఉద్యమం కొత్తపుంతలు తొక్కుతూ ఎక్కువమందిని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
