Regim change is AGENDA : RAJNATH
ప్రభుత్వాన్ని కూల్చడమే వారి ఎజెండా
లక్నో ; దేశంలో ప్రభుత్వాన్ని కూల్చడం, నాయకత్వాన్ని మార్చడమే ప్రతిపక్షం ఉద్దేశమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆందోళనకారుల డిమాండ్ జ్ఞానేశ్ ను మార్చడమో, ఎస్ఐఆర్ ను రద్దు చేయడమో కాదని, ప్రభుత్వాన్నే మార్చడమని అన్నారు. ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాటలు విన్నాక వారి ఎజెండా ఏదో తెలిసిపోయిందని ఆయన విమర్శించారు. సిజెపితో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీల యావ అంతా అధికారం కోసమేనని, హింస ద్వారా దేశంలో కల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని గద్దె దించడమే వారి లక్ష్యమని ఆయన అన్నారు. ఆందోళనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడం, స్వతంత్రంగా వ్యవహరించే ఇసి వంటి రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడమే వారి పని అని రాజ్ నాథ్ దుయ్యబట్టారు. ఢిల్లీలో గురువారం విలేకరుల సమావేశంలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, అవును అందులో తప్పేముంది. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, న్యాయమైన ఆందోళనలను, నిరసనను అణచివేస్తున్న ఈ సర్కార్ ను కూల్చాలనుకోవడంలో తప్పేముందని అన్నారు. తమకు బంగ్లాదేశ్ ఉద్యమం ఆదర్శమని ఎఐఎస్ఎ నేత నేహా బోరా కూడా ప్రకటించారు. అక్కడ విద్యార్థులు ఉద్యమించి ప్రభుత్వాన్ని కూల్చివేసిన సంగతి విదితమే.
కాగా, దీన్ని బిజెపి తీవ్రంగా తప్పుపట్టింది. ఇన్నాళ్ళుగా సిజెపి, ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ కోసం చేస్తున్న ఆందోళనలన్నీ ముసుగు మాత్రమేనని బిజెపి అధికార ప్రతినిధులు ప్రదీప్ భండారీ, సిఆర్ కేశవన్ విమర్శించారు. ఇదిలా ఉండగా, అసలు ఆందోళనకారులకు ఈ అవకాశం ఇవ్వకుండా , ఎన్నికల అవకతవకలను, అక్రమాలను సవరిస్తే మేలు కదా, అందులో భాగంగా సిఇసిని తొలగిస్తే తప్పేముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇన్ని ఆరోపణలు భరిస్తూ, ఇంత అప్రజాస్వామికంగా నిరసనకారులను అణచివేయడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు.
