Gossips

జైలర్ ని జైలర్ గానే తీయాలి!

జైలర్ -2 రివ్యూ!
రచన – దర్శకత్వం
:నెల్సన్ దిలీప్‌కుమార్
తారాగణం : రజనీకాంత్,
రమ్య కృష్ణన్,మిర్నా మీనన్, విద్యా బాలన్, రిత్విక్, యోగి బాబు, ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు తదితరులు.
సంగీతం:
అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్
బ్యానర్ : సన్ పిక్చర్స్
నిర్మాత:
కళానిధి మారన్
విడుదల : అక్టోబర్ 15, 2026
రేటింగ్ : 1.75 /5

2023 నాటి బ్లాక్‌బస్టర్, రజనీకాంత్ నటించిన ‘జైలర్’ కి సీక్వెన్స్ తీస్తామని విడుదలైన వెంటనే ప్రకటించారు. ఆ మేరకు సీక్వెల్ తీసి విడుదల చేశారు. మళ్ళీ రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మొదటి భాగం ఉత్కంఠభరిత క్లయిమాక్స్ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సీక్వెల్ నిర్మించారు. రజనీకాంత్ మరో కొత్త అండర్‌వరల్డ్ సమస్యని ఎదుర్కోవడం, దర్శకుడు నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, మాస్ యాక్షన్ సన్నివేశాలతో తమిళనాడు, కేరళ నేపథ్యాల్లో ఈ సినిమాని మొదటిదానికి తీసి పోకుండా తెరకెక్కించాలనుకున్నారు. అయితే అప్పట్లో ‘షోలే తీసిన రమేష్ సిప్పీ, వెంటనే ‘షోలే’ లాంటి ‘షాన్’ తీయాలనుకుని చేతులు కాల్చుకున్నట్టు, ‘షోలే కా షాన్ మత్ బనావో’ అని విమర్శకులు ఎత్తిపొడిచినట్టు, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్  ‘జైలర్ కా జైలర్ బనావో’ (జైలర్ ని జైలర్ లాగే తీయాలి) అని రివర్స్ లో అనుకోక పోవడం వల్ల సమస్య వచ్చి పడింది. ‘జైలర్ 2’ ‘షాన్’ లాగే తయారైంది. ఇదెలా జరిగిందో తెలుసుకుందాం…

కథేమిటి?
‘జైలర్’ లో ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్)
మలయాళీ గ్యాంగ్‌స్టర్ వర్మ (వినాయకన్) ని చంపి కథ ముగించిన తర్వాత, ఈ సీక్వెల్ లో రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్  పాండియన్ (రజనీకాంత్), కుటుంబంతో కలిసి తమిళనాడులోని ఓ మారుమూల వూళ్ళో సెటిలవుతాడు. ఆ కుటుంబంలో భార్య విజయ (రమ్యకృష్ణన్), కోడలు శ్వేత (మిర్నా మీనన్), మనవడు (రిత్విక్) వుంటారు. కొడుకు చనిపోయిన విషాదంలో కుటుంబం వుంటుంది. ముత్తువేల్ ఓ సూపర్ మార్కెట్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తూంటాడు.

ఇలా వుండగా, వర్మని చంపి ఆరువేల కోట్లు విలువజేసే విగ్రహాల్ని దోచుకున్న వాళ్ళని గాలించే పనిలో వుంటాడు కేరళ గ్యాంగ్ స్టర్ దిలీప్ (సూరజ్ వెంజరమూడు). ఇటు ముత్తువేల్, ఇంటికి నీటి సరఫరా విషయంలో మునిసిపల్ ఉద్యోగిని గాయపర్చి, మూర్తి (నమో నారాయణ) అనే వ్యాపారి బ్లాక్ మెయిల్ కి లొంగి, అతడిదగ్గర డ్రైవర్ గా చేరతాడు. ఒక దారితప్పిన ప్రయాణీకుడుగా విమల్ (యోగిబాబు) తగిలి ముత్తువేల్ వెంటే వుంటాడు.

ఈ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్స్ కి ముత్తువేల్ మీద అనుమానం వస్తుంది. అసలితనెవరో తెలుసుకునే ప్రయత్నంలో దాడి చేసినప్పుడు- వర్మని చంపి విగ్రహాలు దోచుకుంది ఇతనేనని తెలుస్తుంది. మూర్తి దగ్గర డ్రైవర్ గా చేరడమే నాటకమని, అసలు విగ్రహాల స్మగ్లింగ్ వెనుక వున్న పెద్ద గ్యాంగ్ ఎవరో తెలుసుకోవడానికే ఈ రూటులో వచ్చాననీ చెప్పి ముత్తువేల్, ఆ మాస్టర్ మైండ్ బోధి కల్పక్ (ఎస్ జే సూర్య) ని చంపాలని దిలీప్ ని ఎదురు బ్లాక్ మెయిల్ చేస్తాడు.

ఇప్పుడేం జరిగింది? దిలీప్ వెళ్ళి బోధి కల్పక్ ని చంపాడా? బోధి కల్పక్ ఎవరు? ఇతను గోవా గ్యాంగ్ స్టర్ చక్రి (మిథున్ చక్రవర్తి)కీ, కాంత (విద్యాబాలన్)కీ ఏమవుతాడు? ముత్తువేల్ బోధి కల్పక్ ని ట్రాప్ చేసినప్పుడు ముత్తువేల్ కుటుంబం ఎలాటి ప్రమాదంలో పడింది? అలాగే గతంలో ముత్తువేల్ కి సహాయం చేసిన మాండ్యా గ్యాంగ్ స్టర్ నరసింహా (శివరాజ్ కుమార్) కుటుంబానికీ ఎలాటి ప్రమాదం తలెత్తింది? అలాగే గతంలో ముత్తువేల్ కి సహాయపడ్డ మాథ్యూ (మోహన్ లాల్), కామదేవ్ (జాకీష్రాఫ్) లతో బాటు, ఇప్పుడు  తాజాగా రోడా (హృతిక్ రోషన్) అనే ఇంకో గ్యాంగ్ స్టర్ కల్పక్ ముతాని తుదముట్టించేందుకు ముత్తువేల్ కెలా తోడ్పడ్డారు? ఇదీ మిగతా కథ.

ఎవరెలా చేశారు?
‘జైలర్’ లోని గిమ్మిక్కులు లేని రిటైర్డ్ జైలర్ సహజ పాత్రని అప్ గ్రేడ్ చేయకుండా, వయసుకి తగ్గట్టు అదే సహజత్వంతో నటించాడు రజనీకాంత్. గ్లామర్ లేదు, విలన్ గ్యాంగ్స్ దగ్గర సాంగ్స్ అప్పుడు మారు వేషాల్లో స్టెప్పుల్లేవు. తన మార్కు ఫైట్స్ లేవు. అసలు ఫైట్సే చేయలేదు. అతడి ఆదేశాలందుకుని సహాయకులే చేస్తూంటారు. అయితే పాత్రకి భావోద్వేగాలు మాత్రం కొరవడ్డాయి. కల్పక్ గ్యాంగుని అంతమొందించడమనే ప్రధాన కథలో తగిన కారణం గానీ, భావోద్వేగ కోణంగానీ లేకపోవడంతో వీటి ప్రభావం సెకండాఫ్ మీద పూర్తిగా పడింది. భావోద్వేగ కోణం ‘జైలర్’ లోనే ఏర్పాటయింది. దాన్ని సీక్వెల్ లో క్యారీ చేసి వుంటే సమస్య తీరేది. దాన్ని కథ చివర్లో ఎక్కడో తెరపైకి తెచ్చినప్పుడు- ఈ ముగింపులో ఏర్పడిన భావోద్వేగ  దీని ప్రాముఖ్యాన్ని గుర్తించలేదు.

‘జైలర్’ లో కొడుకు మరణానికి తనే కారకుడైన నిజం ఇంట్లో దాచి పెడతాడు. అదే ఇప్పుడు సెకండాఫ్ చివర్లో తెర పైకొస్తుంది. భార్యముందు, కోడలి ముందూ, మనవడి ముందూ దోషిగా నిలబడతాడు. ఈ సన్నివేశం చాలా బలమైనదే. అయితే కేవలం ముగింపులో ఈ భావోద్వేగబలం నిష్ప్రయోజనమే అయింది. మొదట్నుంచీ దోషిగా కడుపులో దాచుకున్న నిజంతో స్ట్రగుల్ చూపిస్తూంటే, దానికీ గ్యాంగ్ స్టర్స్ కీ సంబంధం వుండివుంటే వేరేగా వుండేది.

కుటుంబ సభ్యుఉగా రమ్య కృష్ణన్, మిర్నా మీనన్, రిత్విక్ లని సంక్షిప్త పాత్రలు. అజ్ఞాతంగా వుండడం, లేదంటే బందీలుగా వుండడం ఈ పాత్రల పని.

విలన్ బోధి కల్పాక్ గా ఎస్ జే సూర్య తోలి సన్నివేశాల్లో ఆకట్టుకుని తర్వాత్తర్వాత విషయం లేని విలన్ గా మారిపోతాడు. విలలుగా మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కూడా లోతుగా తాకరు. ఈ ముగ్గురూ క్ర్తుత్రిమ విలన్లే. నేటివిటీ వున్నా విలన్గా సూరజ్ వెంజర మూడు ఒక్కడే కథకి తగ్గ విలన్. ఇక యోగి బాబు, నమో నారాయణల కామెడీ పత్రాలు సినిమాకి ప్లస్.

జైలర్ తో రాజనీకాంత్ కి సహాయపడే మోహన్లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ లు ఈసారి అంతగా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో హృతిక్ రోషన్ సైతం డిటో.

అనిరుథ్ రవిచంద్రన్ సంగీతంలో పాటలు ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్. సన్నివేశాలకి బీజీఎం ఫర్వాలేదు. కానీ దోల్బీ అట్మాస్ లో సౌండ్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా వున్నాయి. అలాగే విజయ్ కార్తీక్ కన్నన్ చాయాగ్రహణం పెద్ద ఆకర్షణ. యాక్షన్ సీన్స్ లో షాక్ వేల్యూ ఓకే గానీ, రక్తపాతం మితిమీరింది సెన్సార్ కత్తెర పడేలా.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన బ్రాండ్ డార్క్ కామెడీకి యాక్షన్ ని జోడించే టాలెంట్ ని మరోసారి దిగ్విజయంగా ప్రదర్శించాడు. అయితే ఈ డార్క్ కామెడీ  ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ లో దీన్ని మాయం చేసి ఇంకేదో మాయా జాలం చేయబోతే అది షాన్ లా తయారైంది.

చివరికేమిటి?

ఫస్టాఫ్ కారుడ్రైవర్ గా రజనీకాంత్, ఓనర్ గా నమోనారాయణ, నేస్తంగా యోగిబాబులతో అసలు కథని దాచి నడిపిన డార్క్ కామెడీ సన్నివేశాలు మంచి క్రియేటివిటీ. ఈ సన్నివేశాలు ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ కి కొత్తదనాన్నిస్తాయి. అయితే ఇంటర్వెల్లో ఈ సన్నివేశాలకి అర్ధం బయటపడినప్పుడు….ఇంతవరకూ సస్పెన్స్ అని తెలియకుండా నడిపిన కథనానికి దర్శకుడ్ని అభినందించాల్సిందే. ఈ సస్పెన్స్ వీడిపోయాక విలన్ తో మొదలయ్యే సంఘర్షణ, దాంతో విలన్ కి రజనీ ఇచ్చే టాస్క్ వగైరాలతో ఫస్టాఫ్ బలంగా పూర్తయినట్టు అనిపించదు. రజనీ పాత్రకి ఎమోషనల్ డ్రైవ్ లేకపోవడం కారణం.

దీంతో పాటు, వున్న ఫస్టాఫ్ విలన్ మాయమై సెకండాఫ్ లో కొత్త విలన్లు రావడంతో చాలా సినిమాలకి జరిగినట్టే ఇక్కడా జరిగింది. ఫస్టాఫ్ కోవిలన్, సెకండాఫ్ కో విలన్ సినిమాలు ఆడవు.  ‘జైలర్’ లో మలయాళీ విలన్ వర్మ పాత్ర ఎందుకంత హిట్టయింది? అది నేటివ్ విలన్ పాత్ర. దిగుమతి చేసుకున్న నార్త్ స్టయిలిష్ విలన్ పాత్ర కాదు. ఈ కేరళ నేటివిటీతో విలన్ పాత్రలో వినయకన్ బాక్సాఫీసుకి అతిపెద్ద ఎస్సెట్ అయ్యాడు.

‘జైలర్ 2’లో కేరళ నేటివిటీతో సూరజ్ వెంజరమూడు అలాటి విలనే. కానీ ఇంటర్వెల్ తర్వాత అతను కాస్తా మాయమై నేటివిటీ లేని, ఫక్తు శుష్క స్టయిలిష్ విలన్లుగా ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి,  విద్యాబాలన్ లు వచ్చి చేరిపోయారు. దీంతో స ఫస్టాఫ్ లో నేటివిటీతో కథ, పాత్రలు కాస్తా కృత్రిమత్వాన్ని పులుముకుని స్టయిలిష్ చిత్రీకరణలతో ప్రేక్షకులకి దూరమైపోయింది.

‘షోలే’ భారతీయాత్మని ప్రతిబింబించే పక్కా నేటివ్ సినిమా కాబట్టి అంత హిట్టయింది. ఇదే రమేష్ సిప్పీ నేటివిటీని వదిలేసి స్టయిలిష్ విలన్తో అట్టహాసంగా పాశ్చాత్య తరహా కథ చెప్పడంతో భారతీయాత్మ కోల్పోయి కుప్పకూలింది. ‘జైలర్’ లోని  భారతీయత్మ కూడా ‘జైలర్ 2’ సెకండాఫ్ లో స్టయిలిష్, అల్ట్రా  రిచ్ విలన్లతో కొట్టుకుపోయి కట్టె మిగిలింది. కట్టె మిగలడమంటే బాక్సాఫీసుని కట్టేయడమే. కట్టేసి, ‘జైలర్ కా జైలర్ టూ బనావో’ అని రివర్స్ స్లోగన్ ఇచ్చుకోవడమే!

Rate this article

How useful or interesting did you find this story?

4.5/5 2 ratings