Articles & Opinion

Evolution Of Telugu Heroes అన్నిట్లో అధికుడే మన తెలుగు స్మార్ట్ హీరో

అలా మొదలై అక్కడికే వచ్చారు!

తెలుగు సినిమా హీరో ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత చైతన్యవంత, సామాజిక, కళాత్మక పరిణామాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. పౌరాణికాల్లో భక్తినీ నీతినీ బోధించే పాత్రగా ప్రారంభమై, సామాజికాల్లో తిరుగుబాటుదారుడిగా, కమర్షియల్స్ లో మాస్ ఎంటర్‌టైనర్‌గా, మళ్ళీ చివరికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్-ఇండియా స్టార్ గా పాగావేసే వరకూ ఈ పరిణామం సాగింది. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలపు హీరోగా, స్టార్ గా, పానిండియా వండర్ గా ఎదిగిన తెలుగు కథానాయకుడి పరిణామక్రమంలో ఏ నటుడి పాత్ర ఎంతో పరిశీలిస్తే 5 దశలు కన్పిస్తాయి. 1950 ల నుంచీ 2020 ల వరకూ 70 సంవత్సరాల కాలంలో ఈ చరిత్ర  తెలుసుకుందాం.

పౌరాణిక రూపం, భావోద్వేగ ప్రేమికుడు (1950–1960)
దైవ సమానుడు, నీతికి నిదర్శనం (నందమూరి తారక రామారావు) :
ప్రారంభ దశలో పౌరాణిక, జానపద చిత్రాలదే పైచేయి. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు వంటి దైవిక పాత్రలతో పాటు రావణుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్ని  సైతం అద్భుతంగా పోషించారు. నాటకీయ సంభాషణా చాతుర్యంతో, గంభీర రూపంతో హీరో పాత్రకి  ఒక భారీ స్థాయిని తీసుకొచ్చారు.

కవితాత్మక, విషాద ప్రేమికుడు (అక్కినేని నాగేశ్వరరావు) :  భారీ పౌరాణిక పాత్రలకి సమాంతరంగా ఏఎన్నార్ సున్నిత, భావోద్వేగభరిత ప్రేమికుడి పాత్రల్ని తెరపై ఆవిష్కరించారు (దేవదాసు, ప్రేమ్‌నగర్). హీరో అంటే కేవలం పోరాటాలు మాత్రమే కాకుండా, సున్నిత  భావోద్వేగాలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించవచ్చని నిరూపించారు.

తిరుగుబాటుదారుడు, ఆధునిక సంస్కర్త (1970- 80)
సామాజిక మార్పుకి  గొంతుక (కృష్ణ, శోభన్ బాబు): స్వాతంత్ర్యానంతర ఆదర్శాల స్థానంలో అసంతృప్తి మొదలైన కాలమిది. కృష్ణ భూస్వామ్య వ్యవస్థని , అన్యాయాల్ని  ఎదిరించే సాహసోపేత యాక్షన్ హీరోగా మారారు (అల్లూరి సీతారామరాజు). అంతేకాకుండా ఈస్ట్ మన్ కలర్, సినిమాస్కోప్, కౌబాయ్,  గూఢచారి జానర్లని పరిచయం చేస్తూ సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.

కుటుంబ కథలు, వాస్తవికత: శోభన్ బాబు కుటుంబ బంధాలకి  ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ఆకట్టుకుంటే, కృష్ణంరాజు తీవ్ర గ్రామీణ న్యాయం, తిరుగుబాటు గల పాత్రలతో “రెబల్ స్టార్”గా నిలిచారు.

శ్రామిక వర్గ నాయకుడు, “మాస్” సినిమా ఆవిర్భావం (1980–90)

సామాన్యుడి గొంతుక (చిరంజీవి): 1980ల నాటికి తెలుగు హీరో రూపం సమూలంగా మారింది. చిరంజీవి (ఖైదీ, గ్యాంగ్ లీడర్) అద్భుతమైన బ్రేక్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, సామాన్య శ్రామిక వర్గ ఆకర్షణతో హీరో ఇమేజ్‌ని  పునర్నిర్వచించారు. హీరో అంటే రాజులు లేదా ధనికులే కానక్కర్లేదు; ఆటో డ్రైవర్, కూలీ, నిరుద్యోగి కూడా వ్యవస్థని ఎదిరించి నాయకుడు కావచ్చని నిరూపించారు.

నాలుగు స్తంభాల శకం :
చిరంజీవి: డ్యాన్స్, ఫైట్స్, కామెడీ,  తిరుగుబాటు సినిమాలతో తిరుగులేని మెగాస్టార్.
నందమూరి బాలకృష్ణ: పౌరుషం, గంభీరమైన డైలాగ్ డెలివరీ, ఫ్యాక్షన్ కథలతో హై-వోల్టేజ్ హీరో (సమరసింహారెడ్డి, నరసింహనాయుడు).
అక్కినేని నాగార్జున: స్టైలిష్, అర్బన్ ప్రయోగాలు (శివ, గీతాంజలి). వినూత్న టెక్నికల్ ప్రమాణాలు, సౌండ్ క్రాఫ్ట్‌తో కొత్త ఒరవడిని సృష్టించారు.
దగ్గుబాటి వెంకటేష్: కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, ఎమోషనల్ సెంటిమెంట్, సహజమైన వినోదంతో “విక్టరీ” హీరో.

స్టైలిష్ యూత్ ఐకాన్, హైపర్-కమర్షియల్ స్టార్లు (2000-)
పట్టణీకరణ, యూత్ అప్పీల్: గ్లోబలైజేషన్ పెరిగిన కొద్దీ తెలుగు హీరో మల్టీప్లెక్స్ ప్రేక్షకులకి చేరువవుతూనే, మాస్ మూలాల్ని కోల్పోకుండా చూసుకున్నాడు.

యాటిట్యూడ్ హీరోలు: మహేష్ బాబు (ఒక్కడు, పోకిరి) ఇంటెన్స్, మినిమలిస్ట్ డైలాగ్ డెలివరీతో స్టైలిష్ యాక్షన్ హీరోగా మారారు. పవన్ కళ్యాణ్ (తొలిప్రేమ, ఖుషి, జల్సా) తన ప్రత్యేకమైన మేనరిజమ్స్, స్వతంత్ర వైఖరులతో యువతకి  ఆరాధ్యుడయ్యారు.

మాస్ & డ్యాన్స్ ప్రావీణ్యం: జూనియర్ ఎన్టీఆర్ స్పష్టమైన భాషా ఉచ్ఛారణ, భావోద్వేగాలు, క్లాసికల్-మాస్ డ్యాన్స్‌తో మెప్పిస్తే, , అల్లు అర్జున్ (ఆర్య, దేశముదురు) అద్భుతమైన కొరియోగ్రఫీ, స్టైలిష్ లుక్స్ తో ట్రెండ్‌సెట్టర్‌గా మారారు.

పౌరాణిక వైభవం, పాన్-ఇండియా హీరో (2010ల నుంచి నేటి వరకు)
విశ్వవ్యాప్త కథలు, భారీ తనం: ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి (ప్రభాస్), RRR (జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్) చిత్రాలతో తెలుగు హీరో ప్రాంతీయ సరిహద్దులు దాటి దేశవ్యాప్త ఆకర్షణగా ఎదిగాడు. ఆది పురుష్ లో పౌరాణిక పాత్రతో తిరిగి మొదలైన  చోటుకే చేరుకున్నాడు. ఎన్టీఆర్ పౌరాణికాల నుంచి తిరిగి పౌరాణికాలకు.  కాకపోతే భారీ శారీరక దారుఢ్యం, విశ్వవ్యాప్త భావోద్వేగాలతో కూడిన లార్జర్-దేన్-లైఫ్ రూపం ప్రాణం పోసుకున్నాడు.

ఇక యాంటీ-హీరో, లోపాలున్న నాయకుడు: భారీతనంతో పాటు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి వంటి సినిమాలు  సాంప్రదాయ హీరో నియమాల్ని బద్దలు కొట్టి, మానసిక లోపాలు, తీవ్రమైన ఆవేశం ఉన్న పాత్రల్ని తెరపైకి తెచ్చాయి.

జానర్ ప్రయోగాలు: నేటి తారలు వాస్తవికత, మట్టి వాసన ఉన్న కథలు (రంగస్థలం, పుష్ప), సైన్స్ ఫిక్షన్ దృశ్యకావ్యాలు (కల్కి 2898 AD), భారీ యాక్షన్ థ్రిల్లర్ల మధ్య సమతుల్యతని  సాధిస్తున్నారు.

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate