NEW HEROES COMING in to THE POLITICS
ట్రెండ్ సెట్టర్ సిఎం విజయ్ !
రాజకీయం వైపు పలువురు తమిళ హీరోలు
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో పలువురు సినీ హీరోల ఆలోచనా ధోరణి మారిపోయింది. ఎంజీఆర్, కరుణానిది.జయలలిత, కెప్టెన్ విజయ్ కాంత్ ల తర్వాత సినీ రంగం నుండి పెద్దగా ఎవరూ సక్సెస్ కాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఊగిసలాట ధోరణి, విలక్షణ నటుడు కమల్ హాసన్ పార్టీ వైఫల్యంతో రాజకీయరంగం వైపు ఇతర నటీనటులు కన్నెత్తి చూడలేదు. కాని 2024 ఫిబ్రవరిలో టివికె ను స్థాపించిన విజయ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో పలువరు నటీనటుల వైఖరి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తాము కూడా రాజకీయాల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉబలాటం వారిలో ఆరంభమైంది. రాష్ట్ర రాజకీయం ఇన్నాళ్లు ద్రవిడ, హేతువాదాల చుట్టూనే తిరిగింది. ముఖ్యంగా హిందూ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయాలు రాష్ట్రంలో రాజ్యమేలాయి. నటులకు తమ వ్యక్తిగత అభిరుచులు, ఆశయాలు ఏమి ఉన్నా అదంతా పక్కనబెట్టి డిఎంకె, అన్నాడిఎంకెల రాజకీయ వైఖరే తమ వైఖరిలా మసిలారు. సినీ పరిశ్రమ పూర్తిగా ద్రవిడ రాజకీయాల చెప్పుచేతల్లోనే నడిచిందంటే అతిశయోక్తి లేదు. కాని పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. సిఎం విజయ్ పుణ్యమా అని రాష్ట్ర రాజకీయాలు కరడుగట్టిన ద్రవిడ సిద్ధాంతం నుండి బయటపడి ఇతర అంశాల చుట్టూ తిరుగుతోంది. పలువురు నటులు రాజకీయ అరంగ్రేటం కోసం అర్రులు చాస్తున్నారు. అయితే నేరుగా రాజకీయాల్లో చేరితే జనం, అభిమానగణం హర్షించరనే ఉద్దేశంతో సేవా కార్యకలాపాల ద్వారా అడుగులు వేస్తున్నారు.
పెరియార్ రామస్వామి నాయకర్, అన్నాదురై, కరుణానిధి, ఎంజిఆర్ ల హయాంలో హిందూవ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనపడేది. జయలలిత సిఎం అయ్యాక పరిస్థతిలో కొంత మార్పు వచ్చింది.కరుణానిధి మరణం తర్వాత డిఎంకె శ్రేణులు మెల్లమెల్లగా గుళ్లుగోపురాలకు వెళ్లడం ఆరంభించారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సతీమణి దుర్గ (శాంత) స్వయంగా గుళ్లకు వెళతారు. నిజానికి హిందూవ్యతిరేక, హేతువాద వైఖరిని రాష్ట్రప్రజలు పెద్దగా అంగీకరించడం లేదు. స్టాలిన్ కుమారుడు మాజీ మంత్రి , ప్రస్తుత ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పలువురిని బాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె ఘోరపరాజయానికి అది కూడా కొంతవరకు కారణమని చెప్పవచ్చు. సిఎం విజయ్ చాలా దశాబ్దాల తర్వాత తన కేబినెట్లో ఇద్దరు బ్రాహ్మణులకు చోటు కల్పించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాల దశను, దిశను ఆయన మార్చేశారు. ద్రవిడవాదానికి, హిందూవ్యతిరేకతకు కాలం చెల్లిందని దీంతో స్పష్టమవుతోంది. ఇన్నాళ్లు గుంజాటన పడిన తమిళ హీరోలు పలువురు ఇప్పుడు ధైర్యంగా తాము కూడా రాజకీయాలు చేయవచ్చునని గ్రహించారు. సూర్య, విక్రమ్,శరత్ కుమార్, అజిత్ కుమార్, ధనుష్, కార్తి, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ తదితరులు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. విద్యా,వైద్య సహాయం అందజేస్తున్నారు.
- సతీశ్.కె.కె.
