Andhra Pradesh

DIG PRISONS Jailed in FORGERY Case

జైళ్ళశాఖ డిఐజి అరెస్ట్

 ‘ సుప్రీం’ ఆర్డర్ ఫోర్జరీ …జీవిత ఖైదీ విడుదల

  •  వారెవా సోమశేఖర్ ..8 ఏళ్లకు వెలుగు చూసిన నిజం

బెంగళూరు ; ఆయనో జైళ్ల అధికారి. ఖైదీల సత్ప్రవర్తనకు పాటుపడి వారిని మళ్ళీ సమాజంలో తలెత్తుకునేలా  చేయాల్సిన మనిషి. కాని బుద్ధి వక్రించి వారి సావాసంతో ఆయనే నేరస్తునిగా మారి జైలు పాలయ్యాడు. , బెంగళూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా పనిచేసిన కర్ణాటక జైళ్ళశాఖ డిఐజి. ఎం సోమశేఖర్ ఉదంతమిది. నేరస్తుల సావాసంతో ఆయన చేసిన నేరం సాదాసీదాది కాదు. ఐపిఎస్ చదువుకున్నాడు గనక ఆ స్థాయిలోనే ఉంది. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఫోర్జరీ చేసి 2018లో ఎ.శంకర్ అనే ఓ జీవితఖైదీ విడుదలకు సహకరించాడనే అభియోగంతో అరెస్టయ్యాడు. కిడ్నాప్ చేసి డబ్బుకోసం బెదిరించిన కేసులో అరెస్టయిన ఎ.శంకర్ కు 2004 లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవితఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది. అప్పటినుండి జైల్లో ఉన్న శంకర్ ఆ తీర్పును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. అయితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు కొట్టివేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునే ఖాయం చేశాయి. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆప్పట్లో ఆ జైలులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన ( ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ ) ఎస్. శ్రీకాంత్  సుప్రీం కోర్టు ఇచ్చినట్లు నకిలీఆర్డర్ ను తయారు చేశాడు. దాని సాయంతో 2018 నవంబర్ 13న శంకర్ ను రిలీజ్ చేశారు. ఈ వ్యవహారమంతా అప్పటి సూపరింటెండెంట్ సోమశేఖర్ కు తెలుసని పోలీసులు పేర్కొన్నారు. దానికి సంబంధించిన రికార్డులను దాచిపెట్టాడని విచారణలో తేలింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇంకా విచారణ జరుగుతోంది.

  ఆ జైలులో ఖైదీలకు రాజభోగాలు..

 ఇదిలా ఉండగా, బెంగళూరు సెంట్రల్ జైలు ఇటీవలి కాలంలో వార్తల్లోకెక్కుతోంది. అక్కడ ఖైదీలు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, విందులు,వినోదాలతో జల్సాలు చేస్తున్నారని, రౌడీల బర్త్ డే పార్టీలు జరుగుతున్నాయని తెలిసింది. మాజీ ప్రధాని హెచ్.డి దేవగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ స్మార్ట్ పోన్ తరచుగా వాడుతున్నాడని తేలింది. హత్యకేసులో  అరెస్టయిన నటుడు దర్శన్ కు అక్కడి సిబ్బంది సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తేలింది. గతంలో అరెస్టయి ఇదే జైలుకు వచ్చిన అన్నాడిఎంకె నాయకురాలు వి.కె.శశికళ కు కూడా సిబ్బంది ముడుపులు తీసుకుని మర్యాదలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో అప్పటి సిఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ ఇంకా ఇక్కడ ఎన్నోఅవకతవకలు జరుగుతున్నాయి.

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating