Andhra Pradesh

     పాలిటెక్నిక్ కుర్రాడికి డిఫెన్స్ గ్రాంట్ !

  • రాడార్లకు చిక్కని డ్రోన్ల తయారీ
  • ఐడెక్స్ కింద రూ.3.5 కోట్లు మంజూరు

 న్యూఢిల్లీ ; శత్రుదేశాల రాడార్లకు చిక్కకుండా, ఎలక్ట్రానిక్ జామర్లకు లోను కాకుండా భారత సైన్యానికి పనికి వచ్చే స్వదేశీ డ్రోన్లను తయారు చేసేందుకు ఓ పాలిటెక్నిక్ విద్యార్థికి భారత రక్షణ శాఖ రూ.3.5 కోట్ల గ్రాంట్ మంజూరు  చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లా బహన్వీ గ్రామానికి చెందిన సర్వేశ్ శర్మ అనే పాలిటెక్నిక్ స్టూడెంట్ కు రక్షణ శాఖ ఈ పని అప్పగించింది. రక్షణశాఖకు పనికివచ్చే డ్రోన్ల తయారీ కోసం జోధ్ పూర్ ఐఐటి నిర్వహించిన కాంపిటీషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 50 బృందాలు పాల్గొన్నాయి. వాటిలో సర్వేశ్ శర్మ టీమ్ నాలుగో స్థానంలో నిలిచి పది లక్షల నగదు బహుమతి సాధించుకుంది. సర్వేశ్ హమీర్ పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో  కంప్యూటర్ సైన్స్ ఐదవ సెమిస్టర్ చదువుతున్నాడు .

   కాగా దేశ సరిహద్దుల్లో తమ దళాలకోసం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వినియోగానికి డ్రోన్లు కావాలని , అవి శత్రుదేశాల రాడార్లకు దొరకకూడదని, ఎలక్ట్రానిక్ జామర్లతో ఆగిపోకుండా సాగేలా చూడాలని రక్షణశాఖ అధికారులు సర్వేశ్ బృందానికి సూచించారు. అలాంటి పద్ధతిలో తయారు చేయాలని కోరారు. సర్వేశ్ శర్మ బృందం పోటీలో పాల్గొనేందుకు రూ.87వేలతో డ్రోన్లను తయారు చేసింది. వాటిని చూసిన సైన్యాధికారులు తమకు కావలసిన విధంగా తయారు చేసేందుకు ఈ 3.5 కోట్ల గ్రాంటును అందజేసింది. సర్వేశ్ వాటిని తయారు చేశాక రూర్కీ – ఐఐటి  ప్రయోగశాలలో పూర్తిస్థాయిలో పరీక్షించి చూసి  సైన్యంలో వాడుకుంటారు. ఇందుకోసం సర్వేశ్ కు 20 నెలల గడువు ఇచ్చారు.  కాగా ఈ డ్రోన్లను డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డిఐఓ), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకాల కింద ‘రుద్ర ఎడ్జ్ ’ పేరుతో తయారు చేయబోతున్నారు.   

  సర్వశ్ శర్మ తండ్రి దినసరి కూలీగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. ఈ గ్రాంటు పొందినందుకు సర్వేశ్ ను రాష్ట్ర గవర్నర్ కవీంద్ర గుప్తా అభినందించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేయడంలో యువతరం ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

Rate this article

How useful or interesting did you find this story?

1.0/5 1 rating